చెంచులకు చెలమ నీరే..!

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్ల లోతట్టు ప్రాంతం అమ్రాబాద్ మండలం కొల్లంపేటలో చెంచులకు 15 రోజులుగా నీటి ఎద్దడి నెలకొంది.
చెలమ నీరు తాగుతున్న గిరిజనులు
చెలమ నీరు తాగుతున్న గిరిజనులు
Published on: 

ప్రభాత ఉదయం, అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్ల లోతట్టు ప్రాంతం అమ్రాబాద్ మండలం కొల్లంపేటలో చెంచులకు 15 రోజులుగా నీటి ఎద్దడి నెలకొంది. గ్రామానికి చెందిన 10 చెంచు కుటుంబాలు 15 రోజులుగా తాగునీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోరు మోటర్‌ రిపేర్‌కు రావడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కానీ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు మరమ్మతులు చేయించాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెంచులు అడవిలోని చెలమ నీటిని తాగి దాహం తీర్చుకుంటున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ, మిషన్ భగీరథ అధికారులు స్పందించి, తాగునీటి సౌకర్యం కల్పించాలని చెంచులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ‘ప్రభాత ఉదయం’ అమ్రాబాద్ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సందీప్‌ను వివరణ కోరగా.. అప్రమత్తమైన అధికారులు మోటర్ మరమ్మతుల కోసం చర్యలు చేపట్టారు. ఇదే సమస్యపై మంత్రి సీతక్క స్పందించి కొల్లంపెంటలో తాగునీటి కొరతపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.