

ప్రభాత ఉదయం, మంచిర్యాల: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు భూముల హద్దులు, విస్తీర్ణం పక్కాగా నిర్ధారించేందుకు ప్రభుత్వం రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరు మండలం కోనంపేటలో నిర్వహించిన భూ సర్వే అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ప్రతి మండలం నుంచి తొలి విడతగా రెండు గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ రికార్డుల్లో విస్తీర్ణం తేడాలు, ఆక్రమణలు, హద్దుల వివాదాలు, గ్రామాల సరిహద్దుల సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సర్వే తేదీకి వారం రోజుల ముందే యజమానులకు నోటీసులు అందజేస్తామని తెలిపారు. రీ సర్వే ద్వారా భూముల మ్యాపులు రూపొందించి, నిబంధనల ప్రకారం కొత్త పట్టాదారు పాసు పుస్తకాల జారీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నెన్నెల మండలంలోని రెండు గ్రామాలు, తాండూరు మండలం రాంపూర్‌లో నిర్వహించిన సర్వే ద్వారా సుమారు 95 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. అనంతరం చెన్నూరులోని వసతిగృహం, 100 పడకల ఆస్పత్రి, గోదావరి పుష్కరఘాట్, అమృత్ 2.0 తాగునీటి పనులు, సోమనపల్లిలోని యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణాలు పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.