

ప్రభాత ఉదయం, జనగామ: చిట్టీల పేరుతో ఓ వ్యాపారి బాధితులకు కుచ్చుటోపీ పెట్టిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో ఈ ఘటన చోటుచేసుకున్నది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బీడీ కాలనీకి చెందిన మహ్మద్ అజీజ్ అహ్మద్ మూడు దశాబ్దాలుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాలనీవాసి కావడంతో అతన్ని నమ్మిన ఎంతోమంది చిట్టీలు వేస్తున్నారు. ఈ క్రమంలో చిట్టీలు పూర్తయిన సభ్యులకు రెండేళ్లుగా డబ్బులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాడు. సుమారు రూ.1.50 కోట్ల వరకు చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో అనుమానం వచ్చిన సభ్యులు వారం రోజులుగా అజీజ్ అహ్మద్‌ను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నిర్వాహకుడు.. వారే అప్పులు ఇచ్చారంటూ కోర్టు ద్వారా సభ్యులకు ఐపీ(దివాలా పిటిషన్)నోటీసులు పంపించాడు. కాలనీలో చిట్టీలు వేస్తున్నవారు 50 మంది ఉంటే, కేవలం 28 మందికే నోటీసులు అందాయి. వారంతా ఆదివారం వ్యాపారి ఇంటి వద్ద ఆందోళన చేశారు.