ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం.. ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ!

పోలీసుల అనుమతి లేకుండా ఫామ్‌హౌస్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న వీకెండ్‌ రేవ్‌ పార్టీని ఎస్‌ఓటీ, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. ఈ పార్టీలో సుమారు 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం.. ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ!
Published on: 

ప్రభాత ఉదయం, చేవెళ్ల :

పోలీసుల అనుమతి లేకుండా ఫామ్‌హౌస్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న వీకెండ్‌ రేవ్‌ పార్టీని ఎస్‌ఓటీ, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. చేవెళ్ల మండలం కమ్మెట గ్రామ సమీపంలోని ఎల్జీ ఫామ్‌హౌస్‌లో అక్టోబరు 30న జరిగిన ఈ పార్టీలో సుమారు 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసుల డ్రగ్స్‌ పరీక్షల్లో పార్టీ నిర్వాహకుడు మన్నన్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులకు గంజాయి పాజిటివ్‌గా రావడం కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మన్నన్‌ గతంలో శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లిలోని ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ (ఐబీఎస్‌)లో ఫ్రెషర్స్‌ డే పార్టీ నిర్వహించాడు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఏర్పడిన పరిచయాలను ఆసరాగా చేసుకొని అక్టోబరు 30న చేవెళ్ల మండలం కమ్మెట సమీపంలోని ఎల్జీ ఫామ్‌హౌస్‌లో వీకెండ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పార్టీకి ప్రచారం కల్పించి ఒక్కొక్కరి నుంచి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు వసూలు చేసినట్లు తెలిసింది. పార్టీ జరిగే ప్రాంతాన్ని గోప్యంగా ఉంచి, డబ్బులు చెల్లించిన వారికి చివరి నిమిషంలో ఫామ్‌హౌస్‌ లొకేషన్‌ పంపించాడు.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 108 మంది విద్యార్థులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో ఇక్ఫాయ్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ఫామ్‌హౌస్‌పై ఆకస్మికంగా దాడి చేశారు. అక్కడ ఉన్న విద్యార్థులందరికీ డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా పార్టీ నిర్వాహకుడు మన్నన్‌తో పాటు మరో ఇద్దరికి గంజాయి పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేవెళ్ల సీఐ కట్టా నరేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీలోకి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.