విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నాయి. మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామ పరిధిలో శనివారం ఈ సంఘటన జరిగింది.
విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
Published on: 

ప్రభాత ఉదయం, చేవెళ్ల : పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నాయి. మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటనలో కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను అత్తాపూర్‌కు చెందిన మోక్ష సాయి చరణ్ (20), హఫీజ్‌పేటకు చెందిన యశ్వంత్ (20)గా గుర్తించారు. వీరిద్దరూ పెద్దమంగళారం గ్రామ పరిధిలోని ఓ పొలం వద్ద ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

పోలీసుల వాహనం వస్తోందని పరుగులు.. అంతలోనే ఘోరం!

పొలం వద్ద విద్యార్థులు మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పోలీసుల వాహనం వస్తున్నట్లు భావించి భయంతో పరుగులు తీశారని, ఈ క్రమంలో పక్కనే ఉన్న వరి పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

అడవి పందుల నుంచి పంట రక్షణకు విద్యుత్ తీగలు

సర్వే నంబర్ 330లోని సుమారు అర ఎకరం భూమిని రాజిరెడ్డి అనే రైతు వద్ద కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నట్లు తెలిసింది. పంటను అడవి పందుల బారి నుంచి కాపాడేందుకు పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.