

సాధారణంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఎన్నికల బరిలో దిగితే ఎదురుండదని సులభంగా విజయం సాధిస్తారని భావిస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే సాధారణ నాయకుడు కాదు.. ప్రజాదరణ, రాజకీయ అనుభవం అన్నింట్లో బలంగా ఉన్న నాయకుడే ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంటారు. అయినప్పటికీ రాజకీయాల్లో అనూహ్య ఫలితాలకు కొదవ ఉండదు. అంతటి ఉద్దండులైన వారు సైతం ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన అరుదైన సందర్భాలు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం..
ఎన్టీ రామారావు
ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1989 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ఆయన నాటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి, అనంతపురం జిల్లా హిందూపుర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఎన్టీఆర్ 3,568 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికలలో చిత్తరంజన్ దాస్ కు 54,354 ఓట్లు రాగా , ఎన్టీఆర్కు 50,786 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తి ఓటమి ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ప్రత్యేకమైంది. ఎందుకంటే 1983 ఎన్నికలలో గుడివాడ, తిరుపతి; 1985 ఎన్నికలలో గుడివాడ, హిందూపుర్, నల్గొండ; 1989 ఎన్నికలలో హిందూపుర్, కల్వకుర్తి; 1994 ఎన్నికలలో హిందూపుర్, టెక్కలి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఆయా సందర్భాలలో ఆయన పోటీ చేసిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం సాధించారు. ఒక్క కల్వకుర్తిలో తప్ప. అందుకే ఆయన రాజకీయ జీవితంలోని ఏకైక అసెంబ్లీ ఓటమిగా కల్వకుర్తి ఎన్నికను తరచుగా ప్రస్తావిస్తారు.
కె.చంద్రశేఖరరావు
కె. చంద్రశేఖరరావు 2023 ఎన్నికలలో గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి 6,741 ఓట్ల తేడాతో కేసీఆర్ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు, కేసీఆర్కు 59,911 ఓట్లు వచ్చాయి. ఆసక్తికరంగా ఇదే నియోజవర్గం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 54,916 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో 1983లో సిద్దిపేట నుంచి తొలి సారి పోటీ చేసినప్పుడు ఓటమి పాలయ్యారు. తర్వాత అదే నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994, 1999,2001,2004 ఎన్నికల్లో గెలస్తూ వచ్చారు. 2004, 2006, 2008లలో కరీంనగర్ ఎంపీగా, 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా, 2014, 2018, 2023లలో గజ్వేల్ ఎమ్మెల్యేగా విజయపరంపర కొనసాగించారు. 1983లో తొలి ఓటమి తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కేసీఆర్కు 2023లో కామారెడ్డిలో రెండో సారి పరాజయంగా ఎదురైంది.