

ప్రభాత ఉదయం, చౌటుప్పల్: నిత్యం రోగులకు వైద్య సేవలు అందించడంలో నిమగ్నమై ఉండే వైద్యులు, నర్సులు, ఆస్పత్రి సిబ్బంది మంగళవారం కలిసికట్టుగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఆస్పత్రి వార్డులను రంగురంగుల పూలతో అలంకరించారు. వివిధ పూలతో బతుకమ్మలను పేర్చి ఆస్పత్రి ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. ఈ విశేష కార్యక్రమానికి వేదికగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రం పరిధిలోని బంగారుగడ్డ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం నిలిచింది. ఈసందర్భంగా ఆస్పత్రి సిబ్బంది అందరూ కలిసి లయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడారు. సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ఆస్పత్రి ఎదుటనున్న దేవతకు పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. ఆయుధ పూజ చేశారు.
శానిటేషన్ సిబ్బందికి వస్త్రాల పంపిణీ
ఆస్పత్రి శానిటేషన్ సిబ్బందికి చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్‌పర్సన్ మోగుదాల పావనీరమేశ్ గౌడ్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సూర్యశ్రీ రావు చేతుల మీదుగా వస్త్రాలను పంపిణీ చేశారు. బతుకమ్మ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. వైద్య సేవల నిలయమైన ఆస్పత్రిలో బతుకమ్మను జరుపుకోవడం సంతోషంగా ఉందని చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్‌పర్సన్ మోగుదాల పావనీరమేశ్ గౌడ్, కౌన్సిలర్ బత్తుల జయమ్మ అన్నారు. ఈ పండుగ ఆడబిడ్డల గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ చంద్రశేఖర్, వైద్యాధికారులు వైష్ణవి, విజయలక్ష్మి, వరలక్ష్మి ప్రియ, కావేరి, నజీమా, అనిల్ కుమార్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.