

ప్రభాత ఉదయం, చౌటుప్పల్ : సంచలనం కలిగించిన జోగిని సుధాకర్ హత్య కేసు నిందితులను చౌటుప్పల్ పోలీసులు మూడు గంటల్లో పట్టుకున్నారు. డీఎస్పీ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్‌యాదవ్ మాట్లాడుతూ చౌటుప్పల్‌కు చెందిన రాళ్లబండి సుధాకర్ పూజలు, కొలుపులు నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. ఆయనకు కానుకల రూపంలో నగదు, బంగారు ఆభరణాలు సమర్పించేవారు. అక్టోబర్ 31 రాత్రి సుధాకర్ ఇంటికి వచ్చిన మేనల్లుడు గుర్రం సురేశ్ తన భార్యతో కలిసి రాత్రి 9.30 గంటల వరకు మాట్లాడి తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ 11 గంటలకు ఫోన్ చేయగా, పవన్, అతడి స్నేహితుడు హర్ష తన వద్దకు వచ్చారని, వారితో మాట్లాడిన తర్వాత నిద్రపోతానని సుధాకర్ చెప్పాడు.
అర్ధరాత్రి హత్య..
అదే రోజు అర్ధరాత్రి మృతుడి ఫోన్ నుంచి సురేశ్‌కు వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లు రావడంతో మేనమామ ఇంటికి వెళ్లి పరిశీలించాడు. గేటు, మెష్ డోర్ తెరిచి ఉండటంతో పాటు ఇంటి ముందు కారు కనిపించలేదు. ఆందోళన చెందిన అతడు 112కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదటి అంతస్తులోని బెడ్‌రూమ్‌లో సుధాకర్ హత్యకు గురైనట్లు గుర్తించారు.
నిందితుల గుర్తింపు
చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐ సతీశ్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులు నాగ్‌పూర్ ఎన్‌హెచ్-44పై ఉన్న టోల్‌ప్లాజాలను అప్రమత్తం చేయగా, నవంబర్ 1 తెల్లవారుజామున నిర్మల్ జిల్లా గంజాల్ టోల్‌ప్లాజా వద్ద అక్కడి పోలీసులు మధ్యప్రదేశ్‌కు చెందిన పవన్‌కుమార్ (21), ఉత్తరప్రదేశ్‌కు చెందిన హర్ష్ సంతోశ్పాండే (24)లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిని నిర్మల్‌లోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు చౌటుప్పల్ జేఎఫ్‌సీఎం కోర్టుకు తీసుకెళ్లారు.
నగదు, నగలు స్వాధీనం
నిందితుల నుంచి 1 కిలో 319.33 గ్రాముల బంగారం, 3 కిలోల 600.66 గ్రాముల వెండి వస్తువులు, రూ.9,03,300 నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, మృతుడికి చెందిన ఐఫోన్, నిందితుల ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకోగా, సొత్తు మొత్తం రూ.1,73,63,300గా వెల్లడించారు.