టార్గెట్ 2.0..మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు రేవంత్‌ ప్లాన్‌

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనాపరమైన మార్పులు, అధికారుల పనితీరు సమీక్ష, బదిలీలపై ప్రత్యేక దృష్టి సారించారు.
Revanth Reddy to review governance and administrative performance.
సీఎం రేవంత్ రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, ప్రత్యేక ప్రతినిధి :

తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ప్రజా ప్రభుత్వం’ రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో, పట్టుదలతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పాలనాపరమైన మార్పులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిసెంబర్‌ 7తో కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో, ఇప్పటివరకు అమలైన పథకాలు, ప్రభుత్వ నిర్ణయాల ఫలితాలు, క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పనితీరును సమీక్షించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరగాలంటే సంక్షేమ పథకాల ప్రకటనలతో పాటు వాటి అమలు కూడా సమర్థంగా ఉండాలని భావిస్తున్న సీఎం.. పరిపాలనలో లోపాలను గుర్తించి సరిదిద్దడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు రెండేళ్లే ఉండటంతో మిగిలిన కాలాన్ని ప్రభుత్వ పనితీరులో మార్పులకు కీలక దశగా పరిగణిస్తున్న నేపథ్యంలో, అధికార యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. పాలకులు తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కాకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందన్న అంచనాతో.. పనితీరు ఆధారంగా అధికారులకు బాధ్యతలు అప్పగించే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి అధికారంలోకి రావాలంటే.. అంత ఈజీ కాదని భావిస్తున్న సీఎం, తొందరపాటు నిర్ణయాల జోలికి వెళ్లవద్దన్న భావనతో ఉన్నారు. పాలకులు ఎంత అప్రమత్తంగా ఉన్నా, రాజకీయంగా చాకచక్యంగా వ్యవహరించినా.. ప్రభుత్వంలో 50శాతం అధికారుల పాత్రే ఉండటంతో ముందుగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది.

అధికారుల పనితీరుపైనా నివేదికలు

ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, జిల్లాలు, కీలక శాఖల్లో అధికారుల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇంటెలిజెన్స్‌ వర్గాల నివేదికలు, మరోవైపు ప్రైవేట్‌ సర్వే సంస్థల నుంచి అందే సమాచారాన్ని పరిశీలించి.. ప్రజల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి సమస్యలు, పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులను అంచనా వేయాలన్నది ఈ ప్రక్రియలో ప్రధాన ఉద్దేశంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతున్నాయా? ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయా? అధికారుల స్పందన ఎలా ఉంది? క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆదేశాలు అమలవుతున్నాయా? వంటి అంశాలను మరింత లోతుగా సమీక్షించే అవకాశం ఉంది. ఈ సమీక్షలో గుర్తించిన లోపాల ఆధారంగా శాఖల పనితీరును మెరుగుపరిచేందుకు మార్పులు చేపట్టవచ్చని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు వంద శాతం అమలు చేయలేని పరిస్థితుల్లో కొన్ని వర్గాల ప్రజల్లో కొంత వ్యతిరేక భావం పెరిగింది. ఈ విషయాలను గుర్తించిన సీఎం రేవంత్‌ అందుకు గల కారణాలు వివరిస్తూ, వాస్తవ పరిస్థితులను వెల్లడిస్తూ.. ప్రత్యేక కార్యకక్రమాల ద్వారా ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టే క్రమంలో ఎక్కడా వైఫల్యాలకు ఆస్కారం లేకుండా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన రాజకీయ నిపుణులతో నిరంతర సమీక్షలు జరుగుతున్నాయి.

అధికార యంత్రాంగంలో భారీ మార్పుల దిశగా..

పరిపాలనలో వేగం పెంచడం, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయడం లక్ష్యంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై సీఎం దృష్టి సారించినట్లు సమాచారం. డిసెంబర్‌లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సబ్‌ కలెక్టర్ల స్థాయి నుంచి శాఖాధిపతుల వరకు, ఏఎస్పీ స్థాయి నుంచి అదనపు డీజీపీ స్థాయి వరకు వివిధ హోదాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, బదిలీలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు వాటి పరిధి, సంఖ్య, సమయంపై స్పష్టత ఉండదు. అయినప్పటికీ, పాలనాపరమైన అవసరాలు, అధికారుల పనితీరు, ప్రభుత్వ ప్రాధాన్యాల ఆధారంగా కీలక స్థానాల్లో మార్పులు చేయవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

‘రైట్‌ ప్లేస్‌-రైట్‌ పర్సన్‌’ విధానంపై దృష్టి

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే కీలక స్థానాల్లో చురుకుగా పని చేసే, నిర్ణయాలు వేగంగా తీసుకునే అధికారులకు అవకాశం కల్పించాలన్నది ఈ కసరత్తులో ప్రధాన అంశంగా చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. సమర్థత, అనుభవం, గత పనితీరు, బాధ్యతల నిర్వహణ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని అధికారులకు పోస్టింగులు ఇవ్వాలన్నది ప్రతిపాదిత విధానంగా ప్రచారం జరుగుతోంది. కీలక శాఖలు, జిల్లాలు, పోలీసు విభాగాల్లో సరైన అధికారులను నియమించడం ద్వారా పాలనలో వేగం పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ విధానం అమలైతే అధికారుల ఎంపికలో రాజకీయ సిఫార్సుల కంటే పనితీరుకే ప్రాధాన్యం ఇవ్వాలన్న సందేశం ప్రజల్లోకి వెళ్లే దిశగా సీఎం రేవంత్‌ చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయ, అధికారిక వ్యవస్థల్లో ప్రత్యేక బృందాలు?

ఎన్నికల్లో లక్ష్యం చేరుకోవాలంటే ఓవైపు రాజకీయ బృందాలు, మరోవైపు అధికారుల బృందాలు సమాంతరంగా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించిన సీఎం, ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయి పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ చేసే బృందాన్ని ఏర్పాటు చేసే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వానికి సంబంధించిన కీలక కార్యక్రమాలను సమన్వయం చేయడం, శాఖల మధ్య సమన్వయ లోపాలను తొలగించడం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై పురోగతిని పర్యవేక్షించడం వంటి బాధ్యతలను ఈ తరహా వ్యవస్థకు అప్పగించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచే బృందాన్ని సిద్ధం చేసుకోవాలన్న ఆలోచనకు కూడా ప్రాధాన్యం ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ప్రత్యేక ఎన్నికల బృందం ఏర్పాటు లేదా దాని నిర్మాణంపై ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. అధికారంలోకి వచ్చేది తామేనంటూ ఓ వైపు బీఆర్‌ఎస్‌, మరోవైపు బీజేపీలు ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న క్రమంలో 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదన్న విషయం అంతర్గత సర్వే నివేదికల ద్వారా సీఎం రేవంత్‌ గుర్తించారు. దీంతో పార్టీ సీనియర్లు, రాజకీయ పండితులతో మేధోమదనం జరిపి రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

చివరి రెండేళ్లు అత్యంత కీలకం

మొత్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో.. పాలనాపరమైన సమీక్షలు, అధికారుల పనితీరు అంచనా, కీలక పోస్టుల్లో మార్పులు వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. అయితే, ప్రతిపాదిత బదిలీలు, సమీక్షల స్వరూపం, అధికారుల నియామకాలపై అధికారిక నిర్ణయాలు వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది. మూడేళ్ల పాలన పూర్తి చేసుకోవడం ఒక ఎత్తయితే, చివరి రెండేళ్లు మరో ఎత్తుగా భావించాల్సి ఉంటుందన్న కోణంలో రేవంత్‌ సర్కారు అప్రమత్తమవుతోంది. ఆ దిశగా అంతర్గత చర్యలు, సమాలోచనలు ఇప్పటికే మొదలయ్యాయి.