

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్రంలో హైస్పీడ్ రైలు మార్గాల పనులను వేగవంతం చేయాలని, గతంలో తెలంగాణకు ప్రతిపాదించిన ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రైల్‌భవన్‌లో శుక్రవారం సాయంత్రం ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన రైల్వేప్రాజెక్టులపై చర్చించారు.
హైదరాబాద్ నుంచి పుణె, బెంగళూరు, చెన్నై కారిడార్లకు సంబంధించి కేంద్రం పంపిన ప్రతిపాదనలను సమీక్షించి ఇప్పటికే నివేదిక పంపించామని సీఎం ఆయనకు వివరించారు. వీటి అలైన్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన తర్వాతే భూసేకరణ మొదలు పెడతామని, త్వరగా అలైన్మెంట్ ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. అలాగే, పలు కీలక రైల్వే మార్గాలను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా టేకల్‌కోడ్ పరిసరాల్లో భారీగా సున్నపురాయి నిక్షేపాలు బయటపడ్డాయని, ఆ ప్రాంతాన్ని సిమెంట్, టెక్స్టైల్ హబ్‌గా మార్చడానికి ఈ మార్గాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్ చుట్టూ సుమారు 360 కి.మీ మేర నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు పక్కనే రీజినల్ రింగ్ రైలు అలైన్మెంట్ ఖరారు చేయాలని, దీని ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అదే విధంగా డోర్నకల్ – గద్వాల, కల్వకుర్తి – మాచర్ల, కాచిగూడ – జగ్గయ్యపేట(250 కి.మీ), పటాన్చెరు – ఆదిలాబాద్(320 కి.మీ), బోధన్ – లాతూర్(175 కి.మీ) మార్గాలతో పాటు 8 కిలోమీటర్ల అక్కన్నపేట బైపాస్ లైన్‌కు తక్షణమే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన మెగా కోచింగ్, ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోను మహబూబాబాద్ సమీపంలోని అనంతారం గ్రామంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిపో కోసం అవసరమైన 409 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని గుర్తుచేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు.