యూనిఫాంలపై విద్యార్థుల ఫీడ్బ్యాక్ సేక‌రించండి : సీఎం రేవంత్

ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులకు అందించిన యూనిఫాంల రంగులు, డిజైన్లపై ఫీడ్‌బ్యాక్ సేకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
CM Revanth Reddy
సీఎం రేవంత్‌రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, హైద‌రాబాద్‌ : విద్యార్థుల‌కు అందించిన యూనిఫాంలపై వారినుంచి అభిప్రాయాలు (ఫీడ్ బ్యాక్‌) సేక‌రించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వివిధ శాఖ‌ల ప‌రిధిలోని ప్రభుత్వ వ‌స‌తిగృహాలు, రెసిడెన్షియ‌ల్​ స్కూల్స్‌, ప్రభుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు యూనిఫాంలు, కిట్ల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి బుధ‌వారం సమీక్షించారు. గ‌తంతో పోలిస్తే ఎంతో నాణ్యమైన యూనిఫాంలు, ఆక‌ర్షణీయ‌మైన రంగులు, డిజైన్లతో అంద‌జేశామ‌న్నారు. అయితే, ఆయా రంగులు, డిజైన్లకు సంబంధించి విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేక‌రించాల‌న్నారు. అలాచేస్తే ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునే రంగులు, డిజైన్లకు భ‌విష్యత్‌లో ప్రాధాన్యమివ్వొచ్చని అన్నారు. కాగా, యూనిఫాంల‌తో పాటు టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, షూలు, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, క‌టోరాలు, కార్పెట్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ దాదాపు పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. ఒక‌ట్రెండు సంస్థల ప‌రిధిలో కొన్ని వ‌స్తువుల పంపిణీ 95 శాతం వ‌ర‌కు పూర్తయిందని చెప్పారు. ఆ వ‌స్తువుల పంపిణీని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. వ‌చ్చే ఏడాదికి విద్యార్థుల‌కు అంద‌జేసే యూనిఫాంలు, ఇత‌ర సామ‌గ్రికి సంబంధించి విధి విధానాల‌ను (ఎస్‌వోపీ) రూపొందించాల‌ని సీఎం సూచించారు. విద్యార్థుల‌కు అంద‌జేసే వ‌స్తువుల జాబితా రూపకల్పన, టెండ‌ర్లు, స‌ర‌ఫ‌రా, అంద‌జేత వ‌ర‌కు ప్రతీది నిర్దేశిత స‌మ‌యంలో పూర్తవ్వాలని తెలిపారు. పాఠ‌శాల‌లు తెరిచిన రోజునే మొత్తం వ‌స్తువులు అందేలా ఇప్పటి నుంచే కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు. ఈ స‌మావేశంలో ఎంపీ వేంన‌రేంద‌ర్ రెడ్డి, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రటరీ ఎన్‌ శ్రీ‌ధ‌ర్‌, సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, రాష్ట్ర గిరిజ‌న‌, వెనుక‌బ‌డిన త‌ర‌గతుల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, వివిధ శాఖల అధికారులు ష‌ఫీఉల్లా, బాల‌మాయాదేవి, విజ‌యేందిర బోయి, దివ్య దేవ‌రాజ‌న్‌, జీ ర‌వి, బీ సైదులు, బీఎం సంతోష్‌, న‌వీన్ నికొల‌స్‌, సీతాల‌క్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మాజీ కౌన్సిల్ చైర్మన్ చక్రపాణి మృతిపై విచారం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ డాక్టర్ చక్రపాణి మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలిని పునరుద్ధరించిన అనంతరం తొలి చైర్మన్‌గా చక్రపాణి ఎంతో నిబద్ధతతో పనిచేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. పార్లమెంటరీ సంప్రదాయాల పట్ల అపారమైన గౌరవం కలిగిన చక్రపాణి చైర్మన్‌గా నిష్పక్షపాతంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో అంకితభావంతో ఎన్నో సేవలందించారని కొనియాడారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని సీఎం తెలియజేశారు.