

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడి ఒప్పందాలు చేసుకునేందుకు, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే కంపెనీల ప్రతినిధులు మనకు అతిథులని, వారికి ప్రత్యేక ఆహ్వానాలు అందించాలని సీఎం సూచించారు. నవంబర్ 15 నాటికి సమ్మిట్ ఏర్పాట్లపై పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న సమ్మిట్ ఏర్పాట్లపై గురువారం మంత్రులు, అధికారులతో రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతి ప్రతినిధికి ఒక లైజనింగ్ అధికారిని నియమించాలన్నారు. వ్యాపారవేత్తలు, కంపెనీల ప్రతినిధులు ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వెంటనే రిజిస్ట్రేషన్, పాస్‌ల జారీ పూర్తి చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగానే వారికి అందజేయాలన్నారు. సదస్సుకు వచ్చే ప్రముఖులు, అన్ని రంగాల ప్రతినిధులు వేదికలోకి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సమ్మిట్‌లో ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారితోపాటు భద్రతా అధికారిని నియమించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్‌కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించాలన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిలో భాగంగా అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. ‘నర్సరీ నుంచి ఆక్స్ఫర్డ్ వరకు’ తెలంగాణ విద్యారంగం ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్‌లో చర్చలు జరగాలని సూచించారు. సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. గతేడాది తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌తో పోలిస్తే ఈసారి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేదిక, వివిధ హాల్స్, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు.
పెట్టుబడులు, టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రాధాన్యం
సమ్మిట్‌లో పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ కార్యక్రమాలను రూపొందించారు. రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్పో, క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. రక్షా ఎక్స్‌పోలో రక్షణ, ఏరోస్పేస్, స్పేస్, సైబర్ సెక్యూరిటీ రంగాలకు చెందిన ఆధునిక పరికరాలు, డ్రోన్లు, రోబోటిక్స్ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఎయిర్ షో కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షా ఎక్స్‌పోలో పాల్గొనేందుకు 575 సంస్థలను ఆహ్వానించగా, ఇప్పటివరకు 49 సంస్థలు ముందుకు వచ్చాయి. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాలకు సంబంధించి ఇండియా జాయ్–2026 నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్
స్టార్టప్‌ల కోసం ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేసి 136 ఆవిష్కరణలను ప్రదర్శించేలా ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్‌లో భాగంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజా మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు నవంబర్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి 60 కంపెనీల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల పెవిలియన్‌లో ఆధునిక సాగు పద్ధతులు, వ్యవసాయ డ్రోన్లు, పాడి, మత్స్య, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, చేనేత, బతుకమ్మ, కాకతీయుల శిల్పకళతోపాటు రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ఎడ్యుకేషన్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల సమ్మిట్‌లో నాలుగు ప్రధాన హాళ్లలో 52 రంగాలవారీగా సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. సమ్మిట్ నిర్వహణకు 25 రంగాలవారీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసి దాదాపు 3,500 ఆహ్వానాలను పంపించారు. అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, వసతి, ప్రొటోకాల్, భద్రత, ప్రదర్శనల నిర్వహణ కోసం పది అధికారుల కమిటీలను ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాట్ల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ఎల్‌నినో సవాళ్లపై తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్
ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వాతావరణ మార్పులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు డిసెంబర్ 8న ప్రత్యేకంగా తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. ఈ సదస్సులో దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు, రైతులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొననున్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, గ్లోబల్ సమ్మిట్ అధికారుల కమిటీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పనుల పురోగతిపై సీఎస్ సమీక్ష
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎక్స్పోగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు పేర్కొన్నారు. సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు, వివిధ కార్యక్రమాల పురోగతిపై గురువారం సెక్రటేరియట్లో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ‘రైజింగ్ తెలంగాణ విజన్’లో భాగస్వాములను చేయడమే సమ్మిట్ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.