కొడంగల్ ప్రజలకు సీఎం దీపావళి కానుకలు

దీపావళి సందర్భంగా కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రూ.9,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
CM Revanth Reddy Visits  Kodangal for development projects and the Mega Farmers Fair
కొడంగల్ పర్యటనలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి పండుగ సందర్భంగా సొంత నియోజకవర్గం కొడంగల్​ ప్రజలకు ‘అభివృద్ధి కానుకలు’ అందించనున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి.. రూ.9,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్​పోను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే, కొడంగల్​ నియోజకవర్గం పరిధిలో రూ.46.08 కోట్లతో నిర్మించిన పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్థానికంగా భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే, 9వ తేదీన హకీంపేటలో నిర్వహించే రైతు బహిరంగ సభకు రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నుంచి దాదాపు 50 వేల మంది రైతులను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇంట్లో సీఎం దీపావళి వేడుకలు

ఈసారి దీపావళి పండుగను ఇందిరమ్మ ఇళ్లలో జరుపుకోనున్నట్టు సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. పేదల సొంతింటి కల సాకారమైన వేళ లబ్ధిదారుల సంతోషంలో తాను కూడా పాలుపంచుకోనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు కూడా ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే, రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

 సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్​ పర్యటన షెడ్యూల్​ ..

7వ తేదీ (శనివారం)

  • ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్​లోని ఎంసీఆర్​హెచ్​ఆర్​డీ హెలిప్యాడ్ నుంచి బయలుదేరుతారు. 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటకు చేరుకుంటారు.

  • 11:10 గంటలకు మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు.
    మధ్యాహ్నం 12 గంటల వరకు స్టాళ్లను సందర్శిస్తారు.

  • మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి

  • మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.

  • 3 గంటలకు హకీంపేట నుంచి రోడ్డు మార్గంలో కొడంగల్ నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

8వ తేదీ (ఆదివారం)

  • ఉదయం 9:15 గంటలకు కొడంగల్ నివాసం నుంచి హకీంపేటకు చేరుకుంటారు.

  • 9:30 నుంచి 10:20 గంటల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమవుతారు.

  • 10.20 గంటలకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.

  • 10:30కు లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్‌ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన.

  • 10.45కు హకీంపేటలో రూ.4 కోట్లతో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు.

  • 11 గంటలకు రూ.2.35 కోట్లతో నిర్మించిన హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

  • 11.30 గంటలకు బొంరాస్​పేటలో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను,11.45 గంటలకు రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు.

  • మధ్యాహ్నం 12.15 గంటలకు కొడంగల్‌లో రూ.3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

  • మధ్యాహ్నం 12.45 గంటలకు దుద్యాలలో రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను, 1.15 గంటలకు రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.

  • మధ్యాహ్నం 1.40 గంటలకు కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు-2కు శంకుస్థాపన చేస్తారు.

  • మధ్యాహ్నం 2 గంటలకు కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు.

  • మధ్యాహ్నం 2.45 గంటలకు దౌల్తాబాద్ మండలం బాలంపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

  • మధ్యాహ్నం 3.30 గంటలకు దౌల్తాబాద్‌లో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తారు. అనంతరం కొడంగల్ నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

9వ తేదీ (సోమవారం)

  • సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కొడంగల్ నివాసం నుంచి హకీంపేటకు బయలుదేరుతారు.

  • రాత్రి 7 గంటల వరకు హకీంపేటలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.