ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు భూసేకరణ షురూ.. వేగంగా చర్యలు

ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం 2,009.23 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,004.31 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
Adilabad Airport
Adilabad Airport Land Acquisition
Published on: 

ప్రభాత ఉదయం, ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విమానాశ్రయం కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 2,004.31 ఎకరాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు.

గ్రామాల వారీగా.. 

అర్లి-బి గ్రామంలో 160.32 ఎకరాలు, కచ్‌కంటిలో 29.19, టాక్లిలో 5.20, అనుకుంటలో 878.13 ఎకరాలకు పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ జారీ చేశారు. నిషాన్‌ఘాట్‌ గ్రామంలో 430.09 ఎకరాలకు గానూ 428.16 ఎకరాలకు, ఖానాపూర్‌లో 288.14 ఎకరాలకు 288.13 ఎకరాలకు; ఆదిలాబాద్‌లో 216.36 ఎకరాలకు గానూ 213.38 ఎకరాలకు సంబంధించి ప్రక్రియ పూర్తయింది. ప్రతిపాదిత భూమిలో దాదాపు నోటిఫికేషన్ జారీ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్‌ వెల్లడించారు.

మిగిలిన భూ సేకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేయడానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుతో జిల్లాలో రవాణా మెరుగుపడుతుందని, పారిశ్రామిక, పర్యాటకరంగాల విస్తరణకు అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.