

నగరంలో నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యాసంస్థలు, ఇతర అవసరాల కోసం గంటల తరబడి ప్రయాణం సాగిస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లో సుమారు 25 లక్షల మంది ప్రయాణిస్తుండగా, దాదాపు 4.50 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయానిస్తున్నారు. బస్సు, మెట్రో రైళ్లకు టికెట్‌లు, పాస్‌లు వేర్వేరుగా తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఒకే టికెట్‌పై ప్రయాణం సాగించేలా తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్ ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థలు కలిసి కామన్ పాస్ విధానాన్ని తీసుకువచ్చాయి.
గాంధీ జయంతి కానుకగా..
అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ‘ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ’ సేవలను ప్రారంభించారు. ‘మీ టికెట్’ పేరుతో మొబైల్ యాప్‌ను కూడా ఆవిష్కరించారు.
ధర ఇలా..
రోజువారీ కామన్ పాస్ ధరను రూ.400గా నిర్ణయించారు. నెలవారీ కామన్ పాస్ ధరను రూ.8,500గా నిర్ణయించారు. రెండు పాస్‌లకు సంబంధించి మెట్రో, ఆర్టీసీకి వాటా ఉంటుంది. ఈ కామన్ పాస్ స్మార్ట్ కార్డును పొందడానికి మొదటిసారి రూ.100 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ కార్డును తిరిగి ఇచ్చేస్తే ఆ డబ్బులను వాపస్ ఇస్తారు. అన్ని ప్రధాన మెట్రో, బస్ స్టేషన్లలో లభించేలా ఏర్పాట్లు చేశారు.
ఔటర్ రింగ్ రోడ్ లోపల అపరిమిత ప్రయాణం
ఈ కామన్ పాస్ తీసుకున్న వారు ఔటర్ రింగ్‌రోడ్ పరిధిలో నడిచే ఆర్డినరీ, మెట్రో లగ్జరీ, ఎలక్ట్రిక్, ఏసీ సహా అన్నిరకాల ఆర్టీసీ బస్సుల్లో రోజంతా ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే మూడు మెట్రో కారిడార్లలోనూ ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. ఈ కామన్ పాస్ విధానం వల్ల సమయం, డబ్బు భారీగా ఆదా కానుంది.
'మీ టికెట్' ద్వారా సులభంగా..
టీజీఎస్‌ఆర్టీసీ తీసుకువచ్చిన ‘మీ టికెట్’ యాప్ ద్వారా ముందుగానే ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయవచ్చు. చెల్లింపు పూర్తి కాగానే యాప్‌లో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. కండక్టర్‌కు ఆ డిజిటల్ క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది. అంతేకాదు రూ.600కే వీక్లీ బస్‌పాస్ పొందవచ్చు. దీనివల్ల ఆర్టీసీ సేవలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారుతాయని అధికారులు భావిస్తున్నారు.