తూకాల్లో మోసం!

నిత్యావసర కొనుగోళ్లలో వినియోగదారుడు మోసపోతున్నాడు. కిలో కొంటే 50 -80 గ్రాములు తక్కువ.. లీటరు ఆయిల్ కొంటే కొన్ని మిల్లీ లీటర్లలో మాయమవ్వడం సర్వసాధారణమయింది.
Nirmal district underweight products consumer complaints
Nirmal district underweight products consumer complaints
Published on: 

ప్రభాత ఉదయం, భైంసా: నిత్యావసర కొనుగోళ్లలో వినియోగదారుడు అడుగడుగునా మోసపోతున్నాడు. కిలో కొంటే 50 -80 గ్రాములు తక్కువ రావడం.. లీటరు ఆయిల్ కొంటే కొన్ని మిల్లీ లీటర్లలో  మాయమవ్వడం సర్వసాధారణమయింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించాల్సిన తూనికలు, కొలతల శాఖ పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో చిల్లర వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారాల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రధాన వ్యాపార కేంద్రాలైన భైంసా, నిర్మల్, ఖానాపూర్ పట్టణాలతో పాటు మేజర్ మండల కేంద్రాలైన కుబీర్, ముధోల్, కడెం, బాసర, లోకేశ్వరం, లక్ష్మణచాంద, పలు మండలాల్లో తూనికలు, కొలతలపై కొనుగోలుదారుల విమర్శలు ఉన్నాయి.  వ్యాపారులు వినియోగించే తూనికల యంత్రాలకు అధికారిక ధ్రువీకరణ ఉందా.. నిర్ణీత కాలానికి తనిఖీలు జరుగుతున్నాయా.. అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. కొన్ని చోట్ల తూకంలో తేడాలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.

అధికారులు ఎక్కడ..!

జిల్లాకేంద్రంతోపాటు భైంసా, ఖానాపూర్ నియోజవర్గ కేంద్రాలు, పలు మండలాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏనాడూ క్షేత్రస్థాయిలో అధికారులు కనిపించకపోవడం, కేసుల ప్రకటనలు ఇవ్వకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. ఇదే విషయమై తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ శంకర్ మాట్లాడుతూ..‘‘ ఎలక్ర్టానిక్ కాంటాలకు ధ్రువీకరణ ముద్ర తప్పక వేయించాలి. వినియోగదారులను మోసం చేసేవారిపై చర్యలు తప్పవు. అక్కడక్కడ ఆకస్మిక దాడులు చేస్తున్నాం.’’ అన్నారు.  

వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

-  తూకం సరి చూసుకోవాలి

- ప్యాకేజీ సరుకులపై ముద్రించిన ధర, గడువు తేదీ తదితర వివాలు తప్పక పరిశీలించాలి.

- అనుమానం కలిగితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.

- తూకం వేయడానికి ముందుగా యంత్రంలో నంబర్ జీరో వద్ద ఉందో లేదో పరిశీలించుకోవాలి.

- తూనిక యంత్రం కొలతల పరికరంపై అధికారిక ధ్రువీకరణ/ముద్ర ఉందో లేదో గమనించాలి.