ఆర్డీఎస్ కాలువ నీటిపై రగడ

ఆర్డీఎస్ కాలువ నీటి మళ్లింపుపై మానవపాడు, జల్లాపురం, బోరవెల్లి గ్రామాల రైతుల మధ్య ఘర్షణ జరిగింది. జేసీబీపై రాళ్ల దాడితో ఆర్డీఎస్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
RDS irrigation canal in Jogulamba Gadwal
ఆర్డీఎస్ కాలువ నీటి పంపిణీ వివాదంతో రైతుల మధ్య ఘర్షణ
Published on: 

ప్రభాత ఉదయం, అలంపూర్​ : ఆర్డీఎస్​ సాగునీటి పంపిణీ ఉద్రిక్తతకు దారితీసింది. నీళ్లు పారక పంటలు ఎండుతుంటే ఆర్డీఎస్​ కాలువకు వస్తున్న కొద్దిపాటి నీటిని ఎగువన ఉన్న రైతులు తమ పొలాలకు మళ్లించుకోవడంతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలువలో రాళ్లు, మట్టి వేసి నీటిని మళ్లించుకుంటున్నారంటూ జోగులాంబగద్వాల జిల్లా మానవపాడు, జల్లాపురం రైతులు బోరవెల్లి గ్రామ రైతులతో వాగ్వాదానికి దిగారు.

దిగువకు నీళ్లు వెళ్లకుండా అడ్డుకట్ట

ఆర్డీఎస్​ కాలువకు ఇరిగేషన్​ ఆఫీసర్లు సాగునీటిని ఇటీవల విడుదల చేశారు. పొలాలకు నీటిని పారించుకొనేందుకు మనవపాడు, జల్లాపూర్​ రైతుల సిద్ధమయ్యారు. అయితే కాలువ దిగువ ప్రాంతానికి నీళ్లు పారకపోవటంతో రెండు గ్రామాల రైతులు ఆర్డీఎస్​ డీ30 డిస్ట్రిబ్యూటర్​కు వెళ్లి పరిశీలించారు. కాలువలో రాళ్లు, మట్టి వేసి నీళ్లు దిగువకు రాకుండా బోరవెల్లి గ్రామానికి మళ్లించుకున్నట్లు గుర్తించారు. దీంతో మానవపాడు, జల్లపూర్​ రైతులు జేసీబీ సాయంతో కాలువలో అడ్డుగా ఉన్న రాళ్లు, మట్టిని తొలగించి నీటిని మళ్లించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బోరవెల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు అక్కడికి చేరుకొని పనులను అడ్డుకొని, జేసీబీపై రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. మానవపాడు, జల్లాపురం రైతులతో బోరవెల్లి రైతులు ఘర్షణ పడ్డారు. రైతుల గొడవతో ఆర్డీఎస్​ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. మానవపాడు, జల్లాపురం రైతులు జేసీబీపై కూర్చొని రాళ్లు వేయాలంటూ బోరవెల్లి రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను శాంతింపచేశారు. అనంతరం జేసీబీతో కాలువలో మట్టి, రాళ్లు, జమ్మును తొలగించడంతో సాగునీరు దిగువకు పారింది.