కొట్లాటల్లో కాంగ్రెస్..నేతల మధ్య ముదురుతున్న ఆధిపత్యపోరు

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం హద్దులు మీరి పరస్పర విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలకు దారితీస్తోంది. కొన్ని సందర్భాల్లో సొంత ప్రభుత్వంపైకే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి.
Congress
కాంగ్రెస్
Published on: 

ప్రభాత ఉదయం, పెద్దపల్లి /మంచిర్యాల : కాంగ్రెస్​లో ప్రజాస్వామ్యం పాళ్లు కొంత ఎక్కువేనని తరచూ ఆ పార్టీ నాయకులే చెబుతూ ఉంటారు. అదొక గొప్ప విషయంగా భావిస్తూ ఉంటారు. కానీ.. ఇటీవలి కాలంలో ఆ ప్రజాస్వామ్యం హద్దులు మీరి, పరస్పర విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలకు దారి తీస్తున్నది. కొన్ని సందర్భాల్లో సొంత ప్రభుత్వంపైకే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న ఉదంతాలూ చోటుచేసుసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న బూతులు తిట్టుకునే స్థాయికి కూడా చేరుకుంది. ఏ జిల్లాలో చూసినా ఒకరంటే మరొకరికి పొసగని వాతావరణం కనిపిస్తున్నది. పెద్దపల్లి, మంచిర్యాల, బాన్స్​వాడ.. ఇలా అనేక ప్రాంతాల్లో నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా వారిని నిలువరించేవారు కానీ, సమన్వయం చేసేవారు కానీ కనిపించడం లేదు. పార్టీ నాయకులు ఇలా కొట్టుకుంటుంటే.. శ్రేణుల్లో అయోమయం నెలకొంటున్నది. అది వారిలో అసహనానికి దారి తీస్తున్నది.

ఎంపీ వర్సెస్​ మంత్రి దుద్దిళ్ల..

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు మధ్య రెండేళ్లుగా అంతర్గత యుద్ధం జరుగుతోంది. మరోవైపు మంచిర్యాల ఎంఎల్​ఏ ప్రేంసాగర్​రావు, మంత్రి వివేక్​ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఎంపీ వంశీకృష్ణ మొదటి నుంచి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను విమర్శిస్తూ వస్తున్నారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏర్పడిన వివాదంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. వారం రోజుల కింద మంథని మండలంలోని ఓ స్కూల్ పిల్లల​కు కాకా ఫౌండేషన్​ ద్వారా ఎంపీ వంశీకృష్ణ బ్యాగులు అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొనగా, వారిని కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు సస్పెండ్ చేశారు. దీనిపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఢిల్లీలో రాహుల్​గాంధీ పాల్గొన్న ర్యాలీకి మంత్రి శ్రీధర్​బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణరావు, రాజ్​ఠాకూర్​  మక్కాన్​సింగ్​ హాజరుకాలేదు. దీనిపై ఎంపీ వంశీకృష్ణ సోషల్​ మీడియా వేదికగా బహిరంగలేఖ విడుదల చేశారు. ర్యాలీలో మంత్రి, ఎమ్మెల్యేలు పాల్గొనడం క్రమశిక్షణ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నిస్తూనే.. ‘ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేయకండి..’ అని వ్యంగ్యంగా స్పందించారు. దీనిపై జిల్లాలో చర్చ కొనసాగుతుండగా, మంత్రి, ఎమ్మెల్యేల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి గెలిపిస్తే తమపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఎంపీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే రెండేళ్లుగా జరుగుతన్న ఈ వ్యవహారంపై మంత్రి శ్రీధర్​బాబు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ ఫొటో ఫ్లెక్సీలో లేదని, ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఎంపీ వంశీ పార్లమెంట్​ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. అలాగే పెద్దపల్లి కలెక్టర్,​ మంత్రికి పీఎలాగా వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసినా మంత్రి స్పందించలేదు. ఈ క్రమంలో ఎంపీ వంశీ మంత్రిపై బహిరంగ లేఖ విడుదల చేయడంపై క్యాడర్ గుర్రుగా ఉంది. రాజకీయ అనుభవం, క్యాడర్​ లేకపోయినా వంశీకృష్ణను గెలిపించేందుకు మంత్రి, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్​ శ్రేణులు కృషి చేశారని గుర్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధిష్ఠానం సీరియస్​గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మంత్రిపై ఆరోపణలు చేస్తే సహించం

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్​ అధికార ప్రతినిధి సెగ్గెం రాజేశ్​, జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు హెచ్చరించారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ, మంత్రి తన సొంత ఖర్చుతో మైసూర్​ పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీని మంథనికి తీసుకువస్తే, ఓర్వలేక ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. పార్టీలు మారే కుటుంబం నుంచి వచ్చిన ఎంపీ వంశీకృష్ణ విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచేందుకు మంథని నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇచ్చామని, ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త కష్టపడ్డారని గుర్తు చేశారు.

మంచిర్యాలలోనూ వర్గపోరే..

మంచిర్యాల జిల్లాలో మొదలైన వర్గ విభేదాలు రాష్ట్రస్థాయి నాయకుల మధ్య బహిరంగ విమర్శలకు కారణమవుతున్నాయి. మంచిర్యాల ఎంఎల్​ఏ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకప్పుడు ప్రేమ్‌సాగర్‌రావుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జగన్మోహన్‌రావుతోనూ విభేదాలు ప్రాంరభమయ్యాయి. జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలు కొత్తేమీ కాకపోయినప్పటికీ, ఇటీవలి పరిణామాలు వాటి తీవ్రతను మరోసారి బయటపెట్టాయి. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్​ మధ్య ప్రొటోకాల్, రాజకీయ ప్రాధాన్యం, పార్టీపై పట్టు వంటి అంశాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్‌రావుకు అత్యంత సన్నిహితుడైన జగన్మోహన్‌రావు ఆయనకు దూరమై వివేక్, వంశీకృష్ణ వర్గానికి దగ్గరవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోస్టర్ల వివాదాలు, కార్యక్రమాల సందర్భంగా ఉద్రిక్తతలు, దండేపల్లి మండలం తాళ్లపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి బహిరంగంగా ప్రశ్నించుకుంటూ, విమర్శలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈక్రమంలో విభేదాలకు పార్టీ అధిష్ఠానం తెరదించుతుందా? లేక నేతల మధ్య ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగుతుందా? అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం కంటే ఆధిపత్యంపైనే నాయకులు దృష్టి పెడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

పోచారం వర్సెస్​ ఏనుగు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్​ పార్టీలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​ రెడ్డి వర్గాల మధ్య తీవ్రమైన వర్గపోరు కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి బీఆర్ఎస్​ నుంచి పోచారం శ్రీనివాస్​ రెడ్డి గెలవగా, కాంగ్రెస్​ నుంచి ఏనుగు రవీందర్​ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పోచారం కాంగ్రెస్​లో చేరారు. దీంతో బాన్సువాడ కాంగ్రెస్‌లో పెత్తనం ఎవరిదనే విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. నామినేటెడ్​ పదవులు, కమిటీలు, స్థానిక సంస్థల్లో పోచారం వర్గానికి ప్రాధాన్యం దక్కుతుండటంతో ఏనుగు రవీందర్​ రెడ్డి వర్గీయులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై, మంత్రుల పనితీరుపై పోచారం చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్​ పార్టీలో కలకలం రేపాయి. దీనిపై ఏనుగు రవీందర్​ రెడ్డి వర్గం పోచారంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ ఆందోళనలకు దిగింది. ఇదిలాఉంటే బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇద్దరు నేతల అనుచరుల మధ్య తరచూ ఘర్షణలు, గొడవలు, నిరసనలు జరుగుతున్నాయి. జహీరాబాద్​ ఎంపీ సురేశ్​ షెట్కర్​తో పాటు జిల్లా నేతలు జోక్యం చేసుకున్నా, వివాదం సద్దుమణగడం లేదు.

సొంత సర్కారుపైనే అనిరుధ్​ రెడ్డి విమర్శలు

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్​ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సొంత పార్టీలో ప్రతిపక్షంగా మారారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సొంత ప్రభుత్వంపై, రాష్ట్రంలో నిధుల కొరతపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన నియోజకవర్గానికి నిధులు రావడం లేదని ఆక్రోశం వెలిబుచ్చారు. ‘నేను చస్తేనే నిధులిస్తారా? బిల్లుల కోసం చావడానికీ సిద్ధమే’ అంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండలం లింగంపల్లిలో గడపగడపకు తిరుగుతుండగా.. రూ.6 వేల పెన్షన్, రైతు భరోసా రాలేదని ఓ దివ్యాంగుడు ఎమ్మెల్యేను నిలదీశాడు. స్పందించిన అనిరుధ్ రెడ్డి.. ‘‘పెన్షన్లు, నిధులు నా చేతిలో లేవు. అవన్నీ సీఎం చూస్తారు. అందరూ అడగాలి. నేనొక్కడినే అడిగి మైనస్​ అవుతున్నా” అంటూ వాపోయారు. ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి వ్యాఖ్యలను టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది. టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంపై ఆయనకు నోటీసులు కూడా అందాయి. అనిరుధ్​ రెడ్డి వ్యాఖ్యలతో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్​ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

మంత్రి పదవి రాలేదని రాజ్​గోపాల్​రెడ్డి రుసరుస

నల్గొండ జిల్లా మునుగోడు ఎంఎల్​ఏ కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి వ్యవహారం మొదటి నుంచీ తేడాగానే ఉంటున్నది. ఆయన మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది మాత్రం అందని ద్రాక్షగానే ఉంటున్నది. దీంతో ఏ సమస్య గురించి మాట్లాడినా.. పనిలో పనిగా తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదన్న విషయాన్ని మాత్రం మర్చిపోకుండా ప్రస్తావిస్తూనే ఉన్నారు. పనిలో పనిగా ప్రభుత్వంపై, పార్టీ పెద్దలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ‘‘మీరు మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చారు. ఇచ్చినప్పుడు ఇవ్వండి. మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? సమీకరణాలు కుదరటం లేదని అంటున్నారు. ఎందుకు సమీకరణలు కుదరటం లేదు? ఎవరు అడ్డుకుంటారు?’’ అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవి అనే విషయం రాజగోపాల్​ ఆశకు అడ్డుపడుతున్నది. అయితే.. ‘‘పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా.. మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని? పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్​ చేసినప్పుడు తెలియదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? నిలదీస్తున్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండగా, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్లగొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరోసారి ‘మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్​గోపాల్​ రెడ్డికి అన్యాయం జరిగినట్టే’ అని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్​ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి.

మంత్రి దామోదర వర్సెస్​ జుక్కల్​ ఎమ్మెల్యే

తాజాగా మంత్రి దామోదర రాజనర్సింహ, కామారెడ్డి జిల్లా జుక్కల్​ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వివాదంపై కాంగ్రెస్​లో చర్చ జరుగుతోంది. నవంబర్​ 2న ఢిల్లీ వేదికగా ఈ వివాదం జరిగింది. ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన వీరిద్దరి మధ్య హోటల్లో తీవ్రస్థాయిలో వాగ్వాదం, ఘర్షణ జరిగింది. రాజకీయ పదవుల నియామకమే వివాదానికి కారణంగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా అంతర్గత రాజకీయాలు, పదవుల నియామకాల్లో పక్క జిల్లా ఎమ్మెల్యే అయిన లక్ష్మీకాంతారావు జోక్యం చేసుకోవడంపై మంత్రి దామోదర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దామోదర ప్రవర్తనపై ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఇప్పటికే పీసీసీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలకు కూడా అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పెద్దపల్లి, మంచిర్యాల కాంగ్రెస్​లో వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో అధిష్టానం జోక్యం చేసుకుంటున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.