‘ఎమ్మెల్సీ’పై వరంగల్ కాంగ్రెస్ నేతలు సైలెంట్

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు సమన్వయంతో పనిచేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Telangana Congress leaders
Published on: 

ప్రభాత ఉదయం, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడంపై కాంగ్రెస్​ నేతలు పెద్దగా ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు, నేతల్లో సమన్వయం లోపించడంతో ఈ ఎలక్షన్​పై ప్రతిష్టంభన నెలకొంది. మూడు జిల్లాల కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, పార్టీ కమిటీలు కలిసికట్టుగా పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్‌ నగర పరిధిలో కొంత హడావుడి కనిపిస్తున్నా.. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి పెద్దగా లేదు. ఎన్నికల్లో కీలకమైన ఓటరు నమోదు కార్యక్రమంపైనా నేతలు అంతగా దృష్టి సారించడం లేదు. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ చేపట్టడం లేదని సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్క జనగామ స్థానం మినహా అన్నింట్లోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ఎన్నికల కార్యాచరణపై యాక్టివ్​గా లేరనే విమర్శలు వస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌ చైర్మన్లు మెజారిటీ కాంగ్రెస్‌ నేతలే ఉన్నప్పటికీ.. సమన్వయం కొరవడటంతో ద్వితీయ శ్రేణి నాయకులు నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమను ముఖ్య నేతలు పట్టించుకోవడం లేదనే భావనతో కొందరు నాయకులు ఎన్నికల వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు.

సూర్యాపేట అభ్యర్థి కావడంతోనే?

సూర్యాపేట జిల్లాకు చెందిన రాంరెడ్డి సర్వోత్తమరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసిన సమయంలో తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని ఉమ్మడి వరంగల్​ ఎమ్మెల్యేలు తొలుత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అభ్యర్థిత్వం ఖరారయ్యాక ఎన్నికల కార్యాచరణపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క నేతృత్వంలో రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు. కానీ నియోజకవర్గాల స్థాయికి వచ్చేసరికి నేతలు చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. మొక్కుబడిగా సమావేశాలకే పరిమితమవుతున్నా రని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి సీతక్క అతిథి పాత్రకే పరిమితమవుతున్నారని, పూర్తి బాధ్యతలను తీసుకోవడం లేదని కార్యకర్తలు అంటున్నారు. కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న వరంగల్​ తూర్పులో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు అయూబ్‌ కొంత యాక్టివ్​గా ఉన్నప్పటికీ.. సురేఖ మాత్రం పట్టింపు లేనట్లుగా ఉంటున్నారు. అభ్యర్థి సర్వోత్తమరెడ్డి  కొండా మురళిని ప్రత్యేకంగా కలిసినప్పటికీ వారి నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు. వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మొన్నటి వరకు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్​‌‌–ఖమ్మం–నల్గొండ స్థానంలో అభ్యర్థి విజయానికి ఉమ్మడి వరంగల్‌ ఓటర్లు చాలా కీలకం. కానీ, ఇక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో అధికార పార్టీ వెనుకబడిందని కార్యకర్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.