

ప్రభాత ఉదయం, హుజూరాబాద్: ఈ సీజన్లో పత్తి రైతులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు తెల్ల బంగారం ధర జిగేల్మంటుండగా, మరోవైపు పత్తి దిగుబడులు ఢమాల్ అయ్యాయి. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాకు రూ.9,200 మేర ధర పలికింది. జాతీయ విపణిలో నెలకొన్న డిమాండ్‌తో పత్తి ధర రోజురోజుకూ పెరుగుతున్నా, ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకునేంత దిగుబడి లేక రైతన్నలు నిరాశకు లోనవుతున్నారు. కరువు పరిస్థితుల ప్రభావంతో ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తుండటంతో భారీగా నష్టపోతున్నామంటూ తల్లడిల్లుతున్నారు.
రూ.10వేలు దాటినా ఆశ్చర్యం లేదు
సరిగ్గా రెండువారాల క్రితం రూ.62వేల నుంచి రూ.64వేల వరకున్న క్యాండీ ధర (356 కిలోల దూది) ఇప్పుడు రూ.69వేలకు చేరుకుంది. మొన్నటి దాకా క్వింటాకు రూ.4,100 పలికిన పత్తి గింజల ధర, ఇప్పుడు రూ.4,500 రేంజ్‌కు ఎగబాకింది. దీంతో నాణ్యమైన పత్తి కోసం జమ్మికుంటలోని వ్యాపారులు క్వింటాకు రూ.9వేలకుపైనే చెల్లిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో పత్తి క్రయవిక్రయాల సీజన్ మొదలై 20 రోజులే గడిచాయి. ఈ స్వల్ప వ్యవధిలోనే క్వింటాకు రూ.2,200 దాకా ధర పెరగడం విపణిలో నెలకొన్న పత్తి కొరతను సూచిస్తోంది. ‘‘పరిస్థితి ఇలాగే కొనసాగితే పత్తి ధర క్వింటాకు రూ.10వేలు దాటినా ఆశ్చర్యం లేదనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మద్దతు ధరకు మించి వ్యాపారులు రేటును చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఐ కొనుగోళ్లకు అవకాశం ఉండకపోవచ్చు” అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పత్తి మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బచ్చు భాస్కర్ పేర్కొన్నారు.
దిగుబడి అంచనాలు తలకిందులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈయేడు 1,66,257 ఎకరాల్లో పత్తి సాగైంది. కరీంనగర్ జిల్లాలో 45,836 ఎకరాలు, పెద్దపల్లిలో 51,426, జగిత్యాలలో 18,720, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 50,275 ఎకరాల్లో పంట వేశారు. నిరుటి కంటే ఈసారి అదనంగా 9,108 ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు 12 నుంచి 16 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించిన వ్యవసాయశాఖ, ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సుమారు 23.27 లక్షల క్వింటాళ్లు రైతుల చేతికి అందొచ్చని అంచనా వేసింది. కానీ ఆరంభం నుంచి వెంటాడిన ప్రతికూల వాతావరణం అధికారుల అంచనాల్ని తలకిందులు చేసింది. ఈ నేపథ్యంలో ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్ల చొప్పున మొత్తంగా దిగుబడులు 9 లక్షల క్వింటాళ్లకు మించకపోవచ్చని లెక్కలు వేస్తున్నారు.
ధర పెరిగినా ఆనందం కరువైంది
‘‘నాకున్న రెండు ఎకరాలకు తోడు, మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాను. కానీ, దిగుబడి రాక భారీగా నష్టపోయాను. మొత్తం సాగుకు రూ.1.40 లక్షలు, కౌలుకు రూ.70 వేలు ఖర్చు చేస్తే 12 క్వింటాళ్ల దిగుబడే దిక్కయింది” అని జమ్మికుంట మండలం మాచనపల్లికి చెందిన రైతు కనవేన రాజయ్య చెప్పుకొచ్చారు. ‘‘మార్కెట్లో పత్తి ధర పెరిగినా మాకు ఆనందమే కరువైంది” అని ఇల్లంతకుంట మండలం భోగంపాడుకు చెందిన రైతు జిల్లెల సత్తిరెడ్డి అన్నారు. తాను సాగు చేసిన ఐదెకరాల్లో పది క్వింటాళ్ల దిగుబడే వచ్చిందని, ఈయేడు రూ.60వేల నష్టం వచ్చిందని ఆయన వాపోయారు. ‘‘ఈ యేడు రైతులందరికీ భారీ నష్టాలు తప్పలేదు. నాకున్న రెండున్నర ఎకరాల్లో చేసిన సాగుకు కేవలం క్వింటా దిగుబడే వచ్చింది. ప్రభుత్వం రైతులందరికీ పరిహారం ఇచ్చి ఆదుకోవాలి” అని జమ్మికుంట మండలం పాతర్లపల్లికి చెందిన రైతు కొడం శంకర్ కన్నీటి పర్యంతమయ్యారు.