బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. ఏడుగురికి గాయాలు

కామారెడ్డి జిల్లా తాడ్కోల్ శివారులో నాటు బాంబులు పేలడంతో ఏడుగురు గాయపడ్డారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Tadkol crude bomb explosion
తాడ్కోల్‌లో నాటు బాంబుల పేలుడు ఘటనలో గాయపడిన చిన్నారులను నిలోఫర్ ఆసుపత్రిలో పరామర్శించిన పోచారం శ్రీనివాసరెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌ శివారులోని ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంలో ఆదివారం నాటు బాంబులు పేలిన ఘటన కలకలం రేపింది. పందుల వేట కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడంతో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం.. దాసరి లక్ష్మయ్య ఇంటి వద్ద మోపెడ్‌లో నిల్వ ఉంచిన నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో లక్ష్మయ్యతో పాటు మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం కొందరిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌, హైదరాబాద్‌ ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన చిన్నారులు దండ్ల అంజలి (3), దండ్ల శ్రీదేవి (5)లను హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. మరో బాధితుడిని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాంబును నేలకేసి కొట్టడంతో పేలుడు సంభవించినట్లు బాధితులు వెల్లడించినట్లు సమాచారం. బాన్సువాడ ప్రాంతంలో అడవి పందుల వేట కోసం నాటు బాంబులు, గుట్టల్లో రాళ్లు పగులగొట్టేందుకు జిలెటిన్‌ స్టిక్స్‌ నిల్వ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

చిన్నారులను పరామర్శించిన పోచారం

నిలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు అంజలి, శ్రీదేవిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. అనంతరం చిన్నారుల కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నిలోఫర్‌ ఆర్‌ఎంఓ, సూపరింటెండెంట్‌, తాడ్కోల్‌ సర్పంచ్‌ రమేశ్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గోపాల్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.