పథకాలను సమర్థంగా అమలు చేయాలి : సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించింది. సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం చేశారు.
State Chief Secretary Sanjay Jaju
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్: జిల్లా కలెక్టర్లు మరింత అంకితభావంతో పనిచేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

జిల్లాల్లోని విద్యాసంస్థలు, ఆసుపత్రులు, గ్రామాల్లో కలెక్టర్లు విస్తృతంగా పర్యటిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. 565 మండలాల్లో ఆవాసాల వారీగా నీటి ఎద్దడి పరిస్థితులను అంచనా వేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిన నేపథ్యంలో సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రూ.120 కోట్లు కేటాయించామని తెలిపారు. గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా వీబీ-జీ రామ్ జీ పథకం కింద ప్రస్తుతం రోజుకు రికార్డు స్థాయిలో 5.38 లక్షల పనిదినాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. చేయూత పథకం కింద వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులకు సంబంధించి మొత్తం 5.9 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. వీటిలో 38 వేల దరఖాస్తులు మినహా మిగిలిన అన్నింటి పరిశీలన పూర్తయిందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను నవంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం రెండు విడతలుగా మంజూరు చేసిన 3.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు

కార్పొరేట్ ఆసుపత్రులు వైద్యం నిరాకరించకూడదు

న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం పథకం అమలులో ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఈహెచ్‌ఎస్ పరిధిలోని రోగులకు ఆసుపత్రుల్లో అడ్మిషన్లు నిరాకరించకూడదని స్పష్టం చేశారు. వైద్య చికిత్సల ధరల్లో పారదర్శకత, ఏకరూపత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.