

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : శాసనమండలి ప్రాంగణంలో మరిన్ని వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనులను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం రాష్ట్ర శాసన మండలి ప్రాంగణాన్ని సందర్శించారు. ప్రతిపాదించిన అభివృద్ధి, సుందరీకరణ పనుల ప్రణాళికలను పరిశీలించారు. శాసనసభ ప్రాంగణానికి సంబంధించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్, అనుబంధ భవనాల ఏర్పాటు, ఇతర సౌకర్యాల అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రతిపాదనలు, ప్రస్తుత స్థల పరిస్థితులు, ఇంజినీరింగ్ అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పర్యావరణహిత, సుస్థిర అభివృద్ధి విధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేసినట్లు సీఎస్ తెలిపారు. పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తూ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టర్ ప్రియాంక అలాతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.