

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎక్స్‌పోగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లు, వివిధ కార్యక్రమాల పురోగతిపై గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ‘రైజింగ్ తెలంగాణ విజన్’లో భాగస్వాములను చేయడమే సమ్మిట్ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఇప్పటికే అనేక సంస్థలు తమ భాగస్వామ్యానికి సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. ముఖ్యంగా స్టార్టప్ పెవిలియన్, క్రియేషన్ కార్నర్ యువత, జెన్-జీలోని సృజనాత్మకత, ఆవిష్కరణలు, నూతన ఆలోచనలకు ప్రోత్సాహం అందించే సమ్మిట్ వేదికగా నిలుస్తుందన్నారు. సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు సీఎస్ పేర్కొన్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రభుత్వ కార్యదర్శులు ఇలంబర్తి, హరిచందన, గౌరవ్ ఉప్పల్, దివ్య దేవరాజన్, శశాంక, అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.