తెలంగాణాలో తగ్గిన సైబర్ నేరాలు : డీజీపీ సీవీ ఆనంద్

సైబర్ మోసాల వల్ల ఆర్థిక నష్టం దేశంలో 4 శాతం తగ్గితే, తెలంగాణలో 20 శాతం తగ్గినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
DGP CV Anand Cyber Crime Meeting
హైదరాబాద్‌లో జరిగిన జేసీసీటీ సమావేశంలో సైబర్ నేరాల నివారణ చర్యలపై చర్చిస్తున్న డీజీపీ సీవీ ఆనంద్
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 2024-25లో సైబర్ నేరాల ఫిర్యాదులు 24 శాతం పెరగ్గా, తెలంగాణలో 3 శాతం తగ్గాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్​బీ) జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్(జేసీసీటీ- IV), హైదరాబాద్ రీజియన్ సమావేశం ఐసీసీలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ ఆనంద్, సైబర్ సెక్యూరిటీ డీజీ శిఖా గోయల్, ఐ4సీ సీఈవో రాజేశ్​కుమార్ సైబర్ నేరాలపై చేపడుతున్న చర్యలను వివరించారు. సైబర్ మోసాల వల్ల దేశంలో జరిగిన ఆర్థిక నష్టం 4 శాతం తగ్గితే, తెలంగాణలో 20 శాతం తగ్గినట్లు వెల్లడించారు. నేరం జరిగిన తర్వాత డబ్బును తిరిగి రాబట్టడం కంటే, ముందుగానే మోసాలను అడ్డుకోవడంపై దృష్టి పెట్టాలని డీజీపీ సూచించారు. సైబర్ నేరగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో ముఠాలుగా పనిచేస్తున్నారని, వారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాల పోలీసుల మధ్య  సమన్వయం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, వారికి ఆర్థిక సహకారం అందిస్తున్నవారిని గుర్తించాలని అన్నారు. ఆగ్నేయాసియాలోని సైబర్ క్రైమ్ కేంద్రాలు ప్రస్తుతం ఆఫ్రికా, శ్రీలంక తదితర ప్రాంతాలకు తరలుతున్నాయని ఆనంద్​ తెలిపారు. అనుమానాస్పద నగదు లావాదేవీలను నిలిపివేసేందుకు బ్యాంకులకు ప్రత్యేక మార్గదర్శకాలు, దర్యాప్తు కోసం ఉమ్మడి వేదిక, సైబర్ నేరాల మౌలిక వ్యవస్థలపై దేశవ్యాప్త ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు డీజేపీ​ వెల్లడించారు. సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, గోవా, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్​, పశ్చిమ బెంగాల్​కు చెందిన 45 మంది న్యాయ నిపుణులు, ఐ4సీ, సీఈఆర్టీ -ఇన్, ఎన్​సీఆర్​బీ, బీపీఆర్ అండ్​ డీ, ఆర్బీఐ, ఈడీ, డివోటీ, సీబీఐ, ఐబీ, ఎన్ఎఫ్ఎస్యూ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీఈ అండ్ సీ శాఖ- 11 భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.