తెలంగాణ ఉద్యమ జ్వాలలు.. పీవీకి పగ్గాలు.. చరిత్రలో 1967 అసెంబ్లీ

తెలంగాణ ఉద్యమ జ్వాలలు.. పీవీకి పగ్గాలు.. చరిత్రలో 1967 అసెంబ్లీ
Published on: 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి 1967లో జరిగిన ఎన్నికలకు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి దక్కడం, తెలంగాణ ప్రజా సమితి (TPS) ఆవిర్భావం వంటి చారిత్రక సంఘటనలకు ఈ శాసనసభ సాక్షిగా నిలిచింది.

287 స్థానాలు..2.09 కోట్ల మంది ఓటర్లు

1967 ఫిబ్రవరి 15, 18, 21 తేదీల్లో మూడు విడతలుగా  మొత్తం 287 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 236 జనరల్, 40 ఎస్సీ, 11 ఎస్టీ స్థానాలు. ప్రాంతాల వారీగా చూస్తే కోస్తాలో 134 స్థానాలు, తెలంగాణలో 95 స్థానాలు, రాయలసీమలో 58 స్థానాలు ఉన్నాయి. మొత్తం 2,09,34,068 మంది ఓటర్లు ఉండగా, 1,44,76,108 మంది ఓటు వేశారు. మొత్తం 1,067 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

165 సీట్లతో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ

1967 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 287 స్థానాల్లో 165 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. 1962లో సాధించిన 177 సీట్లతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు తక్కువ గెలుచుకుంది.   స్వతంత్ర పార్టీ 29, సీపీఐ 11, సీపీఎం 9, జనసంఘ్ 3, రిపబ్లికన్ పార్టీ 1, సంయుక్త సోషలిస్టు పార్టీ 1, స్వతంత్రులు 68 స్థానాలు గెలిచారు. ముఖ్యంగా 68 మంది స్వతంత్రులు గెలవడం ఈ అసెంబ్లీ ప్రత్యేకతగా నిలిచింది.

ఈ సారి కూడా ఇద్దరు సీఎంలు

1962 మాదిరిగానే 1967లో కూడా ఇద్దరు సీఎంలు కొనసాగారు.  కాసు బ్రహ్మానందరెడ్డి రెండవసారి 1967 మార్చి 6న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన గుంటూరు జిల్లా నర్సారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1969 తెలంగాణ ఉద్యమ పరిణామాల నేపథ్యంలో, కేంద్ర అధిష్టానం సూచనల మేరకు 1971 సెప్టెంబరు 15న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అదే రోజన పి.వి. నరసింహారావు (1971 సెప్టెంబర్‌ 30) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన కరీంనగర్ జిల్లా మంథని నుంచి గెలిచారు.

1969 ఉద్యమం..తెలంగాణ డిమాండ్ తీవ్రరూపం

కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలోనే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ మరోసారి తీవ్రరూపం దాల్చి 1969 తెలంగాణ ఉద్యమంగా మారింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన సమయంలో తెలంగాణకు కల్పించిన రక్షణలు, ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం, నిధుల వినియోగం, ప్రాంతీయ అభివృద్ధి వంటి అంశాలపై జరుగుతున్న అన్యాయంతో అసంతృప్తి క్రమంగా పెరిగింది. ముఖ్యంగా ముల్కీ నిబంధనల అమలు, తెలంగాణకు కేటాయించిన నిధులు ఇతర ప్రాంతాలకు మళ్లుతున్నాయనే ఆరోపణలు ఉద్యమానికి ప్రధాన కారణాలుగా మారాయి. ఈ క్రమంలో1968 చివర్లో అసంతృప్తి మొదలైంది. 1969 జనవరిలో ఖమ్మం పట్టణంలో విద్యార్థి అన్నబత్తుల రవీంద్రనాథ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో నిరసనజ్వాలలు ప్రారంభమయ్యాయి. మొదట హామీల అమలు, ముల్కీ హక్కుల రక్షణ కోసం రూపుదిద్దుకున్న ఈ విద్యార్థుల ఆందోళన, స్వల్ప కాలంలోనే ఊపందుకుని తీవ్రరూపం దాల్చి, చివరికి 'ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర' సాధన ఉద్యమంగా రూపాంతరం చెందింది.

కఠిన వైఖరి..పోలీస్ కాల్పుల్లో 369 మంది మరణం

1969 తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రించేందుకు నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. ఆందోళనలు ఉధృతం కావడంతో అనేక ప్రాంతాల్లో పోలీసు కాల్పులు జరిగాయి. నాటి ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం సుమారు 369 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొనడంతో అరెస్టులు, నిరసనలు, బంద్‌లతో తెలంగాణ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాలాంధ్రను సమర్థించిన కాళోజీ నారాయణరావు నుంచి కొండా లక్ష్మణ్‌ బాపూజీ వరకు పలువురు మేధావులు, రాజకీయ నాయకులు, కళాకారులు అప్పటి పరిస్థితులను చూసి ప్రత్యేక తెలంగాణకు మద్దతు ప్రకటించారు.

న్యాయవివాదాల్లో  జీవో 36

ఉద్యమాన్ని శాంతింపజేసే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న నాన్‌-ముల్కీలను (ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులను) వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం జీవో నంబర్‌ 36ను జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వు న్యాయపరమైన వివాదాలకు దారితీసింది. చివరకు కోర్టు జోక్యంతో జీవో 36 అమలు నిలిచిపోయింది. దీంతో ఉద్యోగాల విషయంలో తెలంగాణలో నెలకొన్న అసంతృప్తికి వెంటనే పరిష్కారం లభించలేదు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాజీనామా

ఇదే సమయంలో నాటి మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం ఢిల్లీ వెళ్లారు. అస్సాం పునర్వ్యవస్థీకరణలో మేఘాలయకు కల్పించిన తరహాలో తెలంగాణకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అయితే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అందుకు అంగీకరించలేదు. దీంతో తెలంగాణ డిమాండ్‌కు మద్దతుగా 1969 మార్చి 28న కొండా లక్ష్మణ్‌ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా ఆయన నిలిచారు.

 అష్టసూత్ర పథకం..ఒప్పుకోని తెలంగాణవాదులు

ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది. ఏప్రిల్‌ 9న కేంద్రంలోని వివిధ పార్టీల నేతలతో ఇందిరాగాంధీ సమావేశమయ్యారు. ఏప్రిల్‌ 10న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన కొంతమంది కాంగ్రెస్‌ నేతలతో చర్చలు జరిపారు. అయితే ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులు, తెలంగాణ ప్రజా సమితి నాయకులు వంటి వర్గాలతో ఈ చర్చలు జరగకపోవడం విమర్శలకు దారితీసింది.

ఉద్యమకారులతో నేరుగా చర్చలు జరపాలని అటల్‌ బిహారీ వాజ్‌పేయి తదితర ప్రతిపక్ష నేతలు సూచించారు. అయితే కేంద్రం మరో మార్గాన్ని ఎంచుకుంది. 1969 ఏప్రిల్‌ 11న ఇందిరాగాంధీ ‘అష్టసూత్ర పథకం’ (Eight-Point Formula)ను ప్రకటించారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి, ఆర్థిక వనరులపై సమీక్ష, ప్రభుత్వ ఉద్యోగాల్లో రక్షణలు, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం వంటి అంశాలపై చర్యలు తీసుకోవడం ఈ పథకంలోని ప్రధాన ఉద్దేశాలు.

అయితే అష్టసూత్ర పథకం కూడా ఉద్యమకారులను సంతృప్తిపరచలేకపోయింది. తెలంగాణ హక్కులను శాశ్వతంగా రక్షించుకోవాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో మార్గం లేదని ఉద్యమకారులు తమ డిమాండ్‌ను కొనసాగించారు. దీంతో 1969 తెలంగాణ ఉద్యమం కేవలం ఉద్యోగాలు, నిధులు, అభివృద్ధి వంటి అంశాలకే పరిమితం కాకుండా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన బలమైన రాజకీయ ఉద్యమంగా మరింత విస్తరించింది.

ముఖ్యమంత్రిగా పీవీ..చారిత్రక సంస్కరణలు

1969 ఉద్యమం కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వానికి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరీక్షగా నిలిచింది. ఉద్యమాన్ని ఎదుర్కొన్న తీరు, పోలీసు కాల్పులు, తెలంగాణ ప్రజల్లో పెరిగిన అసంతృప్తి వంటి అంశాలు ఆయన ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపాయి. చివరకు 1971, సెప్టెంబర్ 30న బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అదే రోజున తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపుగా నిలిచింది.

పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక విప్లవాత్మక సంస్కరణలు రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా చారిత్రాత్మక భూపరిమితి చట్టం (Land Ceiling Act) ద్వారా బడా జమీందార్లు, భూస్వాముల వద్ద ఉన్న వేలాది ఎకరాల మిగులు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు, దళితులకు, వెనుకబడిన వర్గాలకు పంచడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు ఆయన తన కుటుంబానికి చెందిన 1200 ఎకరాలకు పైగా ఉన్న భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. విద్యా రంగంలో కూడా పీవీ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన వసతి విద్యనందించేందుకు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ (APREIS) ని స్థాపించి, నల్గొండ జిల్లా సర్వేలు వద్ద మొదటి రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించారు. మాతృభాషలో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడంతోపాటు, సార్వత్రిక విద్యా విధానానికి (Open University System) తొలి బీజం వేశారు.

తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావం..విలీనం

1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఇటువంటి పరిస్థితులలో ఉద్యమానికి రాజకీయ రూపం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడటంతో 1969లో తెలంగాణ ప్రజా సమితి ఏర్పడింది. కేవలం రాజకీయ వేదికగా ఉన్నా తెలంగాణ ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మారుస్తున్న 1971, జనవరి 4న మర్రి చెన్నారెడ్డి ప్రకటించారు. ఈ సమయంలో ఇందిరాగాంధీ పార్లమెంట్‌ను రద్దు చేయడంతో మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి పార్టీ (టీపీఎస్) ‘పార’ గుర్తుతో పోటీ చేసి 14 లోకసభ స్థానాలలో 10 స్థానాలను గెలుచుకుంది. తర్వాత 1972 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇందిరా గాంధీ జరిపిన చర్చల ఫలితంగా 1971 సెప్టెంబర్ 24 టీపీఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.

అనేక కీలక పరిణామాలకు వేదిక

1967లో ఏర్పడిన అసెంబ్లీ.. తెలంగాణ ఉద్యమం, రాజకీయ పునర్వ్యవస్థీకరణ, పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం, తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావం, భూసంస్కరణలు వంటి అనేక కీలక పరిణామాలకు వేదికగా నిలిచింది. ఒకవైపు ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తే.. మరోవైపు పీవీ చేపట్టిన సంస్కరణలు సామాజిక మార్పుకు బాటలు వేశాయి. అందుకే 1967–1972 కాలాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలోనే కాదు.. తెలంగాణ రాజకీయ పరిణామాల చరిత్రలోనూ ఒక కీలక మలుపుగా చూడాల్సి ఉంటుంది.