పోలీసులు ప్రజలకు మధ్య వారధిగా ‘సురక్ష’ : డీజీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సురక్ష’ తొలి వార్షికోత్సవంలో పోలీసు శాఖ, ప్రజల మధ్య సమాచార వారధిగా పత్రిక పనిచేయాలని సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు.
Suraksha police daily newspaper anniversary
‘సురక్ష’ దినపత్రిక ప్రథమ వార్షికోత్సవంలో డీజీపీ సీవీ ఆనంద్
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ :  పోలీసు సేవలు, నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీస్ దిన ప్రతిక ‘సురక్ష’ కీలక పాత్ర పోషించాలని ప్రధాన సంపాదకుడు, డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య సమాచార వారధిగా ‘సురక్ష’ నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్ష’ దినపత్రిక ప్రథమ వార్షికోత్సవ సమావేశం గురువారం హైదరాబాద్‌లోని పేట్లబురుజులో ఉన్న సిటీ పోలీస్‌ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సంపాదకుడి హోదాలో హాజరైన డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ వార్తా  ప్రపంచం అనేక మాద్యమాలతో విస్తరించిన క్రమంలో నిజానిజాలపై మరింతగా పరిశీలన అవసరం ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత కారణాలతో పోలీసులపై తప్పుడు కథనాలు ప్రచురించడం, వాస్తవాలను వక్రీకరించడం జరుగుతోందన్నారు. పోలీసులపై తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పుడు వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ‘సురక్ష’పై ఉందన్నారు.

పోలీస్ సేవలు, సవాళ్ల కథనాలకు ప్రాథాన్యం

పోలీసు వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు, పెట్రోలింగ్‌ విధానాలు, కిడ్నాప్‌ కేసులు, వివిధ నేరాలకు సంబంధించిన వివరాలు, ప్రజల భద్రత కోసం చేపడుతున్న చర్యలను సురక్ష పత్రికలో  ప్రచురించాలని డీజీపీ సూచించారు. కేసుల దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లు, నేరాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే కథనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, ‘సురక్ష’ కార్యనిర్వాహక సంపాదకుడు రమేశ్, ప్రముఖ పాత్రికేయుడు పమిడికాల్వ మధుసూదన్‌, మామిడి హరికృష్ణ, బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌, వివిధ జిల్లాలు, పోలీసు యూనిట్లకు చెందిన పీఆర్వోలు పాల్గొన్నారు.