ఉప ఎన్నికకు ముందే ‘సర్’ ట్విస్ట్.. ఖైరతాబాద్‌లో మారిన ఓట్ల లెక్క!

ఉప ఎన్నికకు ముందే ‘సర్’ ట్విస్ట్.. ఖైరతాబాద్‌లో మారిన ఓట్ల లెక్క!
Published on: 

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు 2026 సెప్టెంబర్ 18న అనర్హత వేటు వేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కిన వేళ.. దానం అనర్హత వ్యవహారం ఆ వేడిని మరింత పెంచింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక తప్పక వస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అదే జరిగితే.. ఇది కేవలం ఒక అసెంబ్లీ స్థానానికి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలక మలుపుగా మిగిలే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌ ఉపఎన్నికలో కీలకంగా మారే అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

41 శాతం ఓట్ల తొలగింపు..ఎవరి కొంప ముంచుతుంది?

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక మిగతా ఎన్నికలతో పోల్చితే భిన్నంగా నిలవబోతోందా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే.. ఎన్నికకు ముందే చోటుచేసుకున్న ఆ ఒక్క కీలక పరిణామం.. ఓటర్ల లెక్కలను మార్చడమే కాదు, ఖైరతాబాద్‌ రాజకీయ భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. అసలు ఆ పరిణామం ఏంటి? ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన  కోసం సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయి నవంబర్ 9 తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. అంటే సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత తెలంగాణ జరిగే తొలి ఎన్నిక ఖైరతాబాద్ ఉప ఎన్నిక అవుతుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది.  

సర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఖైరతాబాద్ నియోజకవర్గంలో 2,96,036 మంది ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా తొలగించిన తొలగించిన బోగస్/ఏస్‌డీడీ ఓటర్ల సంఖ్య  1,23,472 (మరణించినవారు, నివాసం మారినవారు, ఆచూకీ లేనివారు, డూప్లికేట్ ఓటర్లు). అంటే దాదాపు 41 శాతం మంది ఓటర్లను తొలగించారు. ఒక నియోజకవర్గం పరిధిలో ఏకంగా 1.23 లక్షల ఓట్లను ఒకేసారి తొలగించడం ఒక రికార్డు. దీంతో ప్రస్తుతం మిగిలిన ఓటర్ల సంఖ్య 1,72,564. ఇది నియోజకవర్గ ఓటింగ్‌ సరళి, అభ్యర్థుల గెలుపోటములపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించనుంది. సర్ తెచ్చిన మార్పు ఏ పార్టీ కొంప ముంచుతుంది, ఏ పార్టీకి బలంగా మారుతుంది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.  ఈ అంశాలే ఖైరతాబాద్ తీర్పులో కీలకంకానున్నాయి. అంటే ఖైరతాబాద్‌లో అసలు యుద్ధం పోలింగ్‌ రోజున కాదు.. పోలింగ్‌కు ముందే ఓటర్ల జాబితాలో మార్పుతో మొదలైంది!

ఖైరతాబాద్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల సెగ!

మరో వైపు తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ప్రస్తుత ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పదవీ కాలం 2027 మార్చి 29న ముగుస్తుంది. నిబంధనల ప్రకారం పదవీ కాలం పూర్తయ్యేలోపు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పోలింగ్ నిర్వహించాలి. దీంతో ఫిబ్రవరి/మార్చి 2027లో జరిగే ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

 ఇక్కడే ఖైరతాబాద్‌కు ఎమ్మెల్సీ ఎన్నికతో మరో కీలక లింక్‌ ఏర్పడుతోంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఉండటంతో.. ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా పార్టీల ప్రచారం, రాజకీయ సమీకరణాలు, ఓటర్ల స్పందన వంటి అంశాలు ఆ తర్వాత జరిగే ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు ముందు జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలకు  తొలి పరీక్షగా మారనుంది. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికతోపాటు ఎమ్మెల్సీ స్థానం కోసం హోరాహోరీగా తలపడాల్సి ఉంటుంది.

ముస్లిం ఓట్ల లెక్క మారిందా?

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో అత్యంత ప్రభావితం చేసే మరో అంశం.. ముస్లిం ఓటర్లు! ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 40 వేల నుంచి 70 వేల వరకు ముస్లిం ఓటర్లు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 20–25 శాతం. ఈ నేపథ్యంలో గెలుపు ఓటములను నిర్ణయించడంలో వీరిది ప్రధానపాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే.. సర్ తర్వాత ఈ లెక్కల్లోనూ మార్పు కనిపిస్తోంది. ప్రక్షాళనలో ASD కేటగిరీలోకి వెళ్లిన 1,23,472 మంది ఓటర్లలో సుమారు 24 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే తొలగించిన మొత్తం ఓటర్లలో దాదాపు 19 శాతం ముస్లిం ఓటర్లే. ఖైరతాబాద్‌లో ముస్లిం ఓటర్ల లెక్క మారితే.. అది కేవలం ఓటర్ల సంఖ్యలో మార్పు కాదు.. ఇప్పటివరకు ఉన్న రాజకీయ సమీకరణాల లెక్కనూ మార్చే అవకాశం ఉంది. అసలు సర్ తర్వాత ముస్లిం ఓటర్ల సంఖ్యలో వచ్చిన మార్పు.. ఉప ఎన్నికలో ఏ మేరకు ప్రభావం చూపనుందన్నదే ఇప్పుడు  రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన ప్రశ్న! ఇంత పెద్ద మొత్తంలో ముస్లిం ఓటర్లను తొలగించడం ఏ పార్టీ కొంప ముంచుతుందో, ఏ పార్టీకి వరంగా మారుతుంది అనే అంశాలు ఈ ఉప ఎన్నికలో కీలకంగా మారాయి.

ఆరు నెలల్లోనే తలకిందులైన ఓట్ల లెక్క

ఖైరతాబాద్‌లో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ 67,368 (43.48 శాతం), కాంగ్రెస్ అభ్యర్ధి విజయా రెడ్డి 45,358 ఓట్లు ( 29.28 శాతం), బీజేపీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి 38,094 ఓట్లు (24.59 శాతం) సాధించారు. దానం నాగేందర్ సాధించిన మెజార్టీ 22,010 ఓట్లు (14.20 శాతం).

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలల వ్యవధిలోనే నిర్వహించిన 2024 పార్లమెంట్ ఎన్నికల  సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికలలో మూడో స్థానంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇదే కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెరగ్గా, బీఆర్ఎస్ పార్టీ ఓట్లు గణనీయంగా తగ్గాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన దానం నాగేందర్ 57,124 ఓట్లు (37.92 శాతం), బీఆర్ఎస్  అభ్యర్ధి పద్మారావు 16,662 ఓట్లు ( 11.06 శాతం), బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి 73,664 ఓట్లు (48.90 శాతం) సాధించారు. బీజేపీ కిషన్ రెడ్డికి ఈ నియోజకవర్గంలో 16,540 ఓట్ల అధిక్యం దక్కింది (10.98 శాతం).   

2023 అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్‌కు 45,358 ఓట్లు వస్తే.. 2024లో 57,124 ఓట్లు వచ్చాయి. అంటే 11,766 ఓట్లు పెరిగాయి. ఓటు శాతం కూడా 29.28 నుంచి 37.92 శాతానికి పెరిగింది. 2023లో బీజేపీ 38,094 ఓట్లతో మూడో స్థానంలో ఉంటే 2024లో మాత్రం 73,664 ఓట్లతో మొదటి స్థానానికి వచ్చింది. కేవలం ఆరు నెలల్లో ఆ పార్టీకి 35,570 ఓట్లు పెరిగాయి. ఓటు శాతం కూడా 24.59 నుంచి 48.90 శాతానికి పెరిగింది. 2023లో 67,368 ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్‌.. 2024లో 16,662 ఓట్లకే పరిమితమైంది. అంటే ఏకంగా 50,706 ఓట్లు తగ్గాయి. ఓటు శాతం కూడా 43.48 నుంచి 11.06 శాతానికి పడిపోయింది.

మెజార్టీలను మించిన సర్ లెక్కలు

సర్ ప్రక్రియ ద్వారా 1.23 లక్షల మంది ఓటర్లను తొలగించారు. గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య వచ్చిన ఆధిక్యాలతో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా ఎన్నో రెట్లు ఎక్కువ. 2023లో దానం నాగేందర్‌ సాధించిన 22,010 ఓట్ల ఆధిక్యంతో పోలిస్తే 1,23,472 మంది ఓటర్లు 5.61 రెట్లు కాగా.. 2024లో కిషన్‌రెడ్డికి లభించిన 16,540 ఓట్ల ఆధిక్యంతో పోలిస్తే 7.46 రెట్లు ఎక్కువ. ఈ భారీ మార్పు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మొత్తానికి ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక కేవలం ఒక స్థానానికి పరిమితమైన పోరుగా మిగిలిపోదు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలను, పార్టీల బలాబలాలను పునర్నిర్వచించే ప్రధాన ఘట్టం కాబోతోంది.