

ప్రభాత ఉదయం, మిర్యాలగూడ : బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల వ్యవహారం గందరగోళంగా మారింది. మిర్యాలగూడలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని గూబిలి కాలనీలో నిర్మాణాలను చేపట్టారు. మున్సిపాల్టీ వార్డు కౌన్సిలర్ల ద్వారా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆయా వార్డులో అర్హులైన పేదలను గుర్తించకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే అధికంగా ఇండ్లు దక్కాయంటూ అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఇండ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. అప్పటినుండి మూడేళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభానికి నోచుకోకుండా ఆగిపోయాయి. లాటరీలో ఇండ్లను పొందినవారు గృహప్రవేశాలు చేసుకోలేక అవి శిథిలావస్థకు చేరాయి.
పాత జాబితాలో కొత్త పేర్లు
2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, నిరూపయోగంగా పడిఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లుగా తీర్చిదిద్ది పేద ప్రజలకు అందించే కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ క్రమంలో మిర్యాలగూడలో నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తుది మెరుగులు దిద్ది అన్ని సౌకర్యాలను కల్పించి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. లాటరీ పద్ధతి ద్వారా గతంలో ఎంపికైన వారిలో కొంతమంది అనర్హులను తీసివేసి కొత్తగా కొంతమందిని చేర్చి పంపిణీ చేయాలని నిర్ణయించారు. మొత్తం 560 ఇండ్లకుగానూ 330 ఇండ్ల పంపిణీకీ లబ్ధిదారుల జాబితాను కొత్తగా రూపొందించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపికైన లబ్ధిదారుల పేర్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపొందించిన జాబితాలో లేకపోవడంతో లబ్ధిదారులలో ఆందోళన వ్యక్తమవుతున్నది.
లబ్ధిదారుల ఎంపికపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు
లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని అర్హులైన పేదలను పక్కనపెట్టి అనర్హులకు ఇల్లు కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు తోపాటు పలువురు ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిజమైన నిరుపేదలను గుర్తించినట్లయితే డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను ఎందుకు పంపిణీ చేయలేదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు కేటాయించడంతోపాటు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు సైతం డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి అవతవకలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారుల జాబితాలో అవతవకలకు పాల్పడి ఇండ్ల పంపిణీ ఆగిపోవడానికి కారణమైన బీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ వ్యవహారంపై మరోసారి వివాదం తలెత్తడం లబ్ధిదారులను నిరాశకు గురిచేస్తున్నది.