డీఆర్‌డీవో భూమి పరిహారంపై వారం గడువు

- ఈ నెల 16 లోగా అమలు నివేదిక సమర్పించాలి - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
Highcourt
Highcourt
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌: డీఆర్‌డీవో క్షిపణి పరిశోధన కేంద్రం వినియోగిస్తున్న భూమికి పరిహారం చెల్లింపు, భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసే విషయంలో మరో వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ఈ నెల 16వ తేదీలోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. గడువులోగా నివేదిక ఇవ్వకపోతే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్లు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు.

రావిర్యాల గ్రామ పరిధిలోని కంచఇమారత్‌లో ఉన్న 16 ఎకరాల 19 గుంటల భూమికి సంబంధించి ఈ వివాదం కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పహాడీషరీఫ్‌కు చెందిన షాబుద్దీన్‌ తాత మహమ్మద్‌ గౌసుద్దీన్‌ 1986లో భూమిపై హక్కులు, స్వాధీనం కోసం సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం 1996 నవంబర్‌ 15న ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఆ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్‌ దాఖలు చేయకపోవడంతో అది తుది నిర్ణయంగా మారిందన్నది పిటిషనర్‌ వాదన. ఈ మేరకు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, ఈ భూమి డీఆర్‌డీవో పరిశోధన కార్యకలాపాలకు వినియోగంలో ఉన్నందున, భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి పరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. నాలుగు నెలల్లో ప్రక్రియను ముగించి, పిటిషనర్‌కు నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే, ఉత్తర్వులు అమలు కాలేదని పేర్కొంటూ షాబుద్దీన్‌  కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. గతంలో కోర్టు విధించిన గడువు శుక్రవారంతో ముగుస్తున్నప్పటికీ పరిహారం చెల్లింపునకు అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిపై యాజమాన్య హక్కులు ప్రకటించాలని కోరుతూ సివిల్‌ దావా వేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, భూసేకరణ చట్టం ప్రకారం అవసరమైన ప్రక్రియను ప్రాధాన్య ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని వివరించారు. సెప్టెంబర్‌ 9న అవార్డు విచారణకు నోటీసులు జారీ చేసి, అక్టోబర్‌ 9న విచారణ జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ, పరిహారం మొత్తాన్ని జమ చేయాలని కోరుతూ భూసేకరణ అధికారి అక్టోబర్‌ 8న లేఖ పంపారని తెలిపారు. రూ.31.12 కోట్లను జమ చేసేందుకు సంబంధిత కార్యాలయానికి లేఖ పంపి ప్రక్రియను ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పరిహారం చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో వారం గడువు ఇచ్చారు. అక్టోబర్‌ 16న అమలు నివేదికను తప్పనిసరిగా దాఖలు చేయాలని ఆదేశించారు. నివేదిక సమర్పించకపోతే సంబంధిత జిల్లా కలెక్టర్లపై కోర్టు ధిక్కరణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఆదేశాల మేరకు విచారణకు హాజరైన కలెక్టర్‌ తదుపరి విచారణకు సంబంధించిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు.