ఎల్ నినో ఎఫెక్ట్..25 ఏళ్ల తర్వాత సంగమేశ్వరుడి దర్శనం

కరువు తెచ్చిన అరుదైన ఆధ్యాత్మిక అధ్బుతం
Sangameshwara Temple
Sangameshwara Temple
Published on: 

ప్రభాత ఉదయం: ఎల్​ నినో ఎఫెక్ట్‌తో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఓ అరుదైన ఆధ్యాత్మిక అద్భుతానికి వేదికైంది. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలంలోని సోమశిల సమీపంలో ఉన్న చారిత్రక సంగమేశ్వరాలయం కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గడంతో బయటపడుతున్నది. శ్రీశైలం జలాశయం పరిధిలోని చారిత్రక సంగమేశ్వర ఆలయం ఏటా వర్షకాలం వరదల సమయంలో కృష్ణమ్మ నదీ గర్భంలో మునిగిపోతుంటుంది.  ఈ ఏడాది ఆశించిన వరదలు లేక నీటి మట్టం తగ్గిపోవడంతో దాదాపు 25ఏళ్ల తర్వాత వర్షకాలంలోనే సంగమేశ్వర ఆలయం పైకి తేలి భక్తులకు దర్శనమిస్తున్నది.

సాధారణంగా వేసవికాలంలో మాత్రమే కనిపించే ఈ ఆలయం, ఈ ఏడాది ముందుగానే నీటి పైకి తేలింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇలా జరగడం విశేషమని స్థానికులు చెబుతున్నారు. ప్రపంచంలో ఏడు నదులు కలిసే సంగమ ప్రదేశంగా ఈ ఆలయ ప్రాంతాన్ని చెబుతుంటారు. ఇది ఏడాదిలో సుమారు 8 నెలల పాటు కృష్ణా నది నీటిలో మునిగి ఉండి, దాదాపు 4 నెలల పాటు నీటి మట్టానికి పైన ఉంటుంది. ప్రస్తుతం కరువు పరిస్థితుల మధ్య సరైన వర్షాలు లేక, కృష్ణానదికి వరదలు లేక నదిలోంచి ఈ ఆలయం బయటపడుతున్నది.

శ్రీశైలం డ్యామ్ నిర్మాణంతో కృష్ణమ్మ గర్భంలోకి..

కృష్ణా నది ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయం శ్రీశైలం డ్యామ్ నిర్మాణంతో నీట మునిగింది. డ్యామ్ నిర్మాణం తర్వాత 23 సంవత్సరాలు నీటిలోనే ఉంది. అయితే 2003 తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం భారీగా పడిపోయింది. దీంతో ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి ఆలయంలో పూజలు పునః ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో సంగమేశ్వర ఆలయం డ్యామ్‌కు వచ్చిన వరదలతో కృష్ణా నది గర్భంలోకి వెళ్లిపోగా..ఆగస్టు 2న చివరి పూజలు చేశారు. అనూహ్యంగా కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే సంగమేశ్వర ఆలయం నది గర్భం నుంచి బయటపడుతుండటం విశేషం. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పడుతూ ఉండడంతో సప్తనదుల సంగమేశ్వరాలయం గోపుర, శిఖరాలు దర్శనం ఇస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే సంగమేశ్వర ఆలయం పూర్తిగా బయటపడి భక్తులు సంగమేశ్వరుడిని దర్శించుకునే భాగ్యం కలుగనున్నది.

సప్తనదుల సంగమం...సంగమేశ్వర క్షేత్రం

నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని ఈ ప్రాంతం కర్నూలు జిల్లా కొత్తపల్లికి సమీపంలో ఉన్న సంగమేశ్వరంలో.. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలపహరణి, భవనాసి నదులు కలుస్తాయి. ఇందులో భవనాని నది మాత్రమే పురుషనది. మిగిలినవన్ని స్త్రీ నదులు. భవనాసి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే.. మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పునకు ప్రవహిస్తాయి. ఈ సప్తనదులు అష్టాదశ జ్యోతిర్లింగాలలోని ఒకటైన శ్రీశైలాన్ని తాకుతూ ముందుకు సాగి చివరకు సముద్రంలో కలుస్తాయి.  సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాలంటే కర్నూలు నుంచి ఆత్మకూరు వెళ్లి అక్కడి నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి, అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకుంటారు.

సంగమేశ్వరానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందరో మునులు తపస్సు చేసిన పవిత్రమైన స్థలమని చెబుతుంటారు. అగస్త్య మహాముని, విశ్వామిత్రుడు ఇక్కడ తపస్సు చేశారని పురాణాలు పేర్కొంటున్నాయి. విశ్వామిత్ర మహర్షి ఇక్కడి గుహలో గాయత్రీ దేవి కోసం సుదీర్ఘ తపస్సు చేశాక గోమాత రూపంలో గాయత్రీ దేవి ప్రత్యక్షమైందని స్థలపురాణం. ఆ సందర్భంలో రాతిపై గోమాత పాదముద్రలు పడ్డాయని చెబుతారు. సిద్ధేశ్వరానికి, సంగమేశ్వరానికి మధ్యలో గాయత్రీ దేవి పాదముద్రలు ఉన్నాయి. గాయత్రీదేవి పాదముద్రల వద్ద సంధ్యావేళ గాయత్రీ మంత్రం జపిస్తే సకల సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం.

విశిష్ట శివలింగం

సప్తనదులు సంగమించే ప్రదేశంలో ఉన్న సంగమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగం విశిష్టమైనదిగా పూజలందుకుంటుంది. సంగమేశ్వరాలయంలో వేల సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన వేపసాల లింగం ఈ ఆలయం ప్రత్యేకతగా కొనసాగుతున్నది. ఏడాదిలో ఎనిమిది నెలలు నీటిలో మునిగి ఉన్న ఈ శివలింగం రూపంలో మార్పు రాలేదు. వేల సంవత్సరాల క్రితం ధర్మరాజు ప్రతిష్టించిన శివలింగం ఇది. పాండవులు అరణ్యవాసం చేస్తుండగా ధర్మరాజు శ్రీకృష్ణుని సూచన మేరకు శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఏడు నదులు సంగమించే సంగమేశ్వరంలో శివుని పూజ చేయమని శ్రీకృష్ణుడు సూచిస్తాడు. ఇందుకు శివలింగం తీసుకురమ్మని భీముడిని ధర్మరాజు కాశీకి పంపాడు. భీముడు ఎంతకీ రాకపోవడంతో అమృత ఘడియలు దాటిపోతున్నాయని భావించిన ధర్మరాజు అక్కడే ఉన్న వేప చెట్టును నరికి శివలింగంగా మార్చి ప్రతిష్టించి పూజలు చేశాడు. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన భీముడికి పట్టరాని కోపం వచ్చింది. తాను తెచ్చిన శివలింగాన్ని ఆగ్రహంతో విసిరివేయగా.. ఆ శివలింగం ఇప్పటికీ పగిల మండలం బీరవోలు వద్ద పడిపోయింది. నేటికి ఇక్కడ ఆ శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. భీముని ఆగ్రహాం సముచితమేనని భావించిన ధర్మరాజు..అతడిని సముదాయించి..మొదట భీమలింగానికే పూజలు చేయాలని ఆదేశించాడని క్షేత్ర కథనం.

సంగమేశ్వరంలోని వేపసాల లింగం ఇప్పటికీ ఏడాదిలో ఎనిమిది నెలల పాటు అంటే జూలై నుంచి మార్చి ఆరంభం వరకు నీటిలోనే ఉంటుంది. స్కంద పురాణంలో సంగమేశ్వరం ప్రాశస్త్యం ప్రస్తావన కనిపిస్తుంది. అస్తికలు ఈ నదిలో కలిపినా, పితృ దేవతలకు పిండతర్పణం చేసినా ముందు ఏడు జన్మలు, తర్వాత ఏడు జన్మల్లో పాపాలు హరిస్తాయని పురాణ ప్రసిద్ధి. సంగమేశ్వరంలో స్నానం చేసిన వారికి 1000 రెట్ల పుణ్య ఫలం లభిస్తుందని, సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం.