మత్తు మాయలో యువతులు.. నగరంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం

గడిచిన నాలుగేళ్లలో 40 ఏళ్లలోపు వయస్సున్న 538 మంది యువతులపై డ్రగ్ కేసులు నమోదైనట్లు పోలీస్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. విద్యాసంస్థలు పెడ్లర్లకు స్థావరాలుగా మారుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Drugs
డ్రగ్స్​
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌: మహా నగరంలో డ్రగ్ కేసుల ఛేదన పోలీస్ శాఖకు సవాలుగా మారుతోంది. డ్రగ్ పెడ్లర్ల ఎత్తుగడలకు పోలీసు శాఖ దీటైన చర్యలు చేపట్టలేకపోతోంది. డ్రగ్స్​కు బానిసైన వారిలో ఐటీ ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఇటీవల కాలంలో మహిళలు, యువతులు ఉండటం ఆందోళనకరంగా మారింది. గడిచిన నాలుగేళ్లలో 538 మంది యువతులపై డ్రగ్ కేసులు నమోదైనట్లు పోలీస్ నివేదికలు తెలియజేస్తున్నాయి. వీరందరూ 40 ఏళ్లలోపు వారేనని వెల్లడవుతున్నది. విద్యా సంస్థలు డ్రగ్స్ పెడ్లర్లకు  స్థావరాలుగా మారుతున్నాయి. గడిచిన రెండేళ్లలో 950 మంది విద్యార్థులపై డ్రగ్ కేసులు నమోదైనట్లు పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది జూన్ నాటి నివేదిక ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా జనవరి 1 నుంచి జూన్ 11 లోపు 204 మంది విద్యార్థులు ఎన్డీపీఎస్ కేసుల్లో ఉన్నారు. సగటున నెలకు 40 మంది విద్యార్థులు డ్రగ్ కేసుల్లో చిక్కుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఐటీ ఉద్యోగులే అధికం

డ్రగ్ వినియోగించి పాజిటివ్​గా పట్టుబడుతున్న యువతలో అధికంగా ఐటీ ఉద్యోగులు ఉంటున్నారు. డ్రగ్స్​కు బానిసగా మారుతూనే, డ్రగ్స్ సరఫరాలో కీలకంగా పనిచేస్తున్నారు. ఉద్యోగ ఒత్తిడి నుంచి రిలాక్స్ కోసమని అలవాటు చేసుకున్న డ్రగ్స్, వారికి క్రమంగా వ్యసనంగా మారడంతో టెకీల జీవితాలు తలకిందులవుతున్నాయి. కుటుంబ సమస్యల కారణంగా మరికొందరు మత్తుకు బానిసలవుతున్నట్లు ఇటీవల పోలీసులు చేపట్టిన దాడుల సందర్భంలో వెల్లడైంది. డ్రగ్స్ ఎడిక్టర్​గా మారిన కొందరు టెకీలు ఆర్థిక అవసరాలకు డ్రగ్స్ సప్లయర్స్​గా మారుతున్నారు. డ్రగ్స్ పెడ్లర్లు, గంజాయి సప్లయర్స్​పై ఈగల్ టీం చేపట్టిన నిఘాలో 600 మందికి పైగా ఐటీ ఉద్యోగులు డ్రగ్స్​కు బానిసలుగా మారినట్లు గుర్తించారు. వారికి నోటీసులు అందజేసి విచారణ చేపట్టారు.

సవాలుగా మారుతున్న కట్టడి

డ్రగ్స్ కట్టడి సవాలుగా మారిందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సౌత్ రీజియన్ పోలీస్ కోఆర్డినేషన్ సమావేశంలో ప్రస్తావించారు. పోలీస్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా ఏదో ఒక మార్గంలో డ్రగ్స్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయన్నారు. ఈగల్ ఫోర్స్, టాస్క్​ఫోర్స్​, పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా కట్టడి చేస్తున్నా నిత్యం కేసులు నమోదవుతున్నట్లు  తెలిపారు. గంజాయి, కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ, ఎల్ఎస్​డీ బ్లాస్ట్, ఆల్ప్రజోలెం వంటి మత్తు పదార్థాల హాట్​స్పాట్​లపై ఈగల్ టీం నిఘా పెంచినట్లు పేర్కొన్నారు. గంజాయి హాట్​స్పాట్లుగా జీహెచ్ఎంసీ పరిధిలోని ధూల్​పేట, నానక్​రాంగూడాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడుల్లో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 100 మంది సభ్యులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ నంబర్ల ఆధారంగా పోలీసులు వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.