ఫేక్ కాల్స్‌తో రూ.261 కోట్లు కొట్టేశారు

అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్‌ సెంటర్ల ద్వారా రూ.261 కోట్ల మోసానికి పాల్పడిన సిండికేట్‌పై ఈడీ చర్యలు చేపట్టింది.
ED Arrests Fake Call Center Syndicate US Citizens
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్‌ సెంటర్ల ద్వారా భారీ మోసాలకు పాల్పడిన అంతర్జాతీయ సిండికేట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు వేగవంతం చేసింది. 2025 జూలై నుంచి 2026 సెప్టెంబర్ మధ్య దాదాపు రూ.261 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో హర్షిల్ నయన్‌భాయ్ రావల్, జస్వంత్ సింగ్, చేతన్ ముంజల్, ప్రణవ్ పితాడియాలను నవంబర్ 3న మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గతంలో అరెస్టయిన ముగ్గురితో కలిపి ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

పటియాలా, పుణె, చండీగఢ్‌లలో సోదాలు నిర్వహించి మూడు నకిలీ కాల్‌ సెంటర్లను ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాల్లో సుమారు 220 మంది పనిచేస్తున్నట్లు తేలింది. సుమారు 20 లక్షల మంది అమెరికా పౌరుల వ్యక్తిగత డేటాను కొనుగోలు చేసి మోసాలకు పాల్పడ్డారు. జర్మనీ, ఫిన్లాండ్ సర్వర్ల ద్వారా బాధితులకు ఆటో డయలర్‌ కాల్స్ పంపారు. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నట్లు తేలింది. ఈ సోదాల్లో 79 డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలన పూర్తి చేశారు. దుబాయ్, హాంకాంగ్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించి, క్రిప్టోకరెన్సీ రూపంలో భారత్‌కు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అమెరికా ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ నిందితులు బాధితులను భయపెట్టేవారు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ట్రెజరీ, సుప్రీంకోర్టు పేర్లతో నకిలీ పత్రాలు, నోటీసులు సృష్టించారు. వివిధ సంస్థల అధికారుల పేర్లతో 11 నకిలీ గుర్తింపు కార్డులు వాడారు. బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని ఫేక్ అలర్ట్‌లు పంపేవారు. డీఈఏ, ఎఫ్‌టీసీ అధికారులమంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసేవారని దర్యాప్తులో బయటపడింది.