ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పొలాల్లోకి ‘మహా’ దళారులు!

ఎల్ నినోతో పెరిగిపోతున్న బియ్యం ధరలను అదునుగా స్థానిక మిల్లర్లకు, ట్రేడర్స్‌కు పోటీగా మహారాష్ట్ర నుంచి సైతం దళారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అడుగుపెడుతున్నారు.
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పొలాల్లోకి ‘మహా’ దళారులు!
Published on: 

ప్రభాత ఉదయం, జయశంకర్ భూపాలపల్లి : ఎల్ నినోతో పెరిగిపోతున్న బియ్యం ధరలను అదునుగా తీసుకుంటున్న దళారులు జిల్లాలోని పంట పొలాల్లో వాలిపోతున్నారు. స్థానిక మిల్లర్లకు, ట్రేడర్స్‌కు పోటీగా, ఇప్పుడు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి సైతం దళారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అడుగుపెడుతున్నారు. పంట పొలాల్లో తిరుగుతూ రైతులతో ధాన్యం కొనుగోలు కోసం బేరమాడుతున్నారు. పొలాల వద్ధనే పొరుగు రాష్ట్రం బ్రోకర్లు తెలంగాణ ధాన్యాన్ని తన్నుకుపోతున్నారు. తేమ శాతంతో సంబంధం లేకుండా క్వింటాల్‌కు రూ.3500 నుండి రూ. 3800 వరకు చెల్లిస్తామని, అడ్వాన్సుగా పేమెంట్ ఇస్తామని ఆశ చూపుతూ పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే అన్నదాతలు దళారుల ఎరకు చిక్కకుండా, ముంచుకొస్తున్న కరువుపై అవగాహనతో కొంత ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ధాన్యం విక్రయించే సమయానికి ధర మరింతగా పెరిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో పండిన ధాన్యాన్ని వెంటనే అమ్ముకోకుండా నిల్వ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎల్ నినో ప్రభావంతో సరైన నీటి లభ్యత లేక రైతులు వేసిన పంటలలో సగానికి పైగా నష్టపోయారు. పొరుగు రాష్ట్రాలలోనూ ధాన్యం దిగబడులు తక్కువగా ఉండటంతో బియ్యానికి డిమాండ్ పెరిగింది.

రబీ పంట తగ్గితే ధరలు మరింత పైకి..

ఎల్ నినోతో వానకాలం(ఖరీఫ్) వరి పంట దిగుబడులు తగ్గిపోగా, రానున్న యాసంగి(రబీ)పంట సాగు కూడా గణనీయంగా పడిపోయే పరిస్థితి నెలకొంది. గత యాసంగితో పోల్చితే ఈ దఫా 61,560 ఎకరాల్లో పంట విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. గత యాసంగిలో 1,05,675 ఎకరాల్లో వరి సాగు జరగగా, ఈసారి 71,328 ఎకరాల్లో సాగవుతుందని లెక్కలు వేశారు. కరువు పరిస్థితులతో వ్యవసాయ శాఖ అధికారులు వేసిన అంచనా కంటే మరింత తక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో వాన కాలం ధాన్యం కొనుగోలు సమయంలో ప్రభుత్వం కొనుగోలు చేసే మద్ధతు ధర రూ. 2641 కంటే రెండు, మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందనే ప్రచారంతో రైతులు దళారుల అడ్వాన్సుల పట్ల ఆసక్తి చూపడం లేదు. బడా రైతులు కొందరు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకుని కరువు కాలంలో ధరలు పెరిగాక విక్రయించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. 

నిరాటంకంగా ‘మహా’ దళారుల దందా

జిల్లాలో మహారాష్ట్ర రైస్ మిల్లర్ల అక్రమ బియ్యం దందా నిరాటంకంగా కొనసాగుతోంది. భూపాపల్లి, వరంగల్,  కరీంనగర్ , ఖమ్మం జిల్లాల నుండి రేషన్ బియ్యం కాళేశ్వరం మీదుగా మహారాష్ట్రకు రవాణా అవుతుంటుంది. కల్తీ ఎరువులు, విత్తనాలు సైతం అక్కడి నుండి ఈ మార్గంలోనే భూపాలపల్లి జిల్లాకు సరఫరా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారులు పలుమార్లు నకిలీ విత్తనాలు, ఎరువులను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. బియ్యం ధరలకు డిమాండ్ నేపథ్యంలో ధాన్యం కోసం మళ్లీ మహారాష్ట్ర దళారులు జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు.  

 చెక్‌ పోస్ట్‌లున్నా ఆగని అక్రమ కొనుగోళ్లు

మహారాష్ట్ర నుంచి దళారులు రాకుండా కాళేశ్వరం అంతర్ రాష్ట్ర బ్రిడ్జి వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పొరుగు రాష్ట్రం దళారుల కొనుగోళ్ల దందా ఆగడం లేదు. మేడిగడ్డ బరాజ్, అన్నారం బరాజ్‌లపై నుండి వేసిన రోడ్డు వెంట దళారులు జిల్లాలోకి ప్రవేశించి పంట పొలాల్లో తమ దందాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల దళారులు రైతులను పంట విక్రయాలలో మోసం చేయకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.