నేటి నుంచి ఎర్రవెల్లిలో రీ సర్వే

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో వివాదాస్పద ప్రభుత్వ భూముల హద్దులు తేల్చేందుకు అధికారులు బుధవారం నుంచి రీ సర్వే ప్రారంభించనున్నారు.
Bhu Bharati land resurvey in Erravalli and Venkatapur villages
ఎర్రవల్లి, వెంకటాపూర్ భూ వివాదానికి పరిష్కారం చూపేందుకు రీ సర్వే చేపట్టనున్న రెవెన్యూ అధికారులు.
Published on: 

ప్రభాత ఉదయం, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని సర్వే నంబర్‌ 325, శివారు వెంకటాపూర్ పరిధిలోని 7 సర్వే నంబర్లలో రీసర్వేకు రంగం సిద్ధమైంది. రెండు గ్రామాల ప్రభుత్వ భూములను గుర్తించే క్రమంలో అసైన్డ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగడంతో ‘భూ భారతి’ రీ సర్వే పనులకు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. గ్రామసభలను అడ్డుకోవడంతో పాటు సర్వేను నిలిపివేయాలని సోమవారం వెంకటాపూర్ రైతులు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి.. భూ భారతి రీ సర్వే పూర్తయితేనే రెండు గ్రామాల భూములు, అసైన్డ్ భూములు, శివారు హద్దులు స్పష్టంగా తేలుతాయని, సర్వేకు సహకరించాలని  రైతులకు సూచించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. మంగళవారం గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, మర్కూక్ తహసీల్దార్ సరిత ఆధ్వర్యంలో రెవెన్యూ, రీ సర్వే బృందాలు శివారు వెంకటాపూర్ గ్రామపంచాయతీ వద్ద రైతులతో సమావేశమయ్యాయి. దీంతో అధికారుల చొరవతో రీ సర్వే పనులకు మార్గం సుగమమైంది. బుధవారం వెంకటాపూర్ పరిధిలోని 163 నుంచి 210 సర్వే నంబర్ల వరకు సర్వే నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించి, సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేశారు. అలాగే, ఎర్రవల్లి గ్రామస్తులకు కూడా నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు.

గల్లంతైన భూములపై రైతుల ఆందోళన

ఈ రెండు గ్రామాల్లో భూ సర్వే వివాదం తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాటయోధులు, అమరవీరుల కాలనీలు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు గ్రామాల్లో ప్రభుత్వ భూములు గల్లంతయ్యాయంటూ స్థానికులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. రికార్డుల ప్రకారం ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్‌లో 388.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఇందులో 45 ఎకరాల భూమి గల్లంతయినట్టు ప్రత్యేక సర్వే బృందం తేల్చినట్టు తెలిసింది. మరోవైపు, శివారు వెంకటాపూర్ పరిధిలోని 7 సర్వే నంబర్లలో (38, 42, 45, 47, 85, 88, 100) సుమారు 136 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దానిని గుర్తించి తమకు అప్పగించాలని ఆ గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎనిమిది సర్వే నంబర్లు రెండు గ్రామాల సరిహద్దుల్లో ఉండటంతో గత కొన్ని సంవత్సరాలుగా ఇరు గ్రామాల మధ్య భూ వివాదం నడుస్తోంది. అప్పట్లో ఈ భూముల్లో పేదలకు అసైన్డ్ పట్టాలు ఇవ్వగా, కొంతమంది సాగు చేసుకున్నారు. మరికొన్ని పడావు పడి ముళ్లపొదలతో చిట్టడవిగా మారాయి. అయితే, కేసీఆర్ ఫామ్ హౌస్ నిర్మాణం, ఎర్రవల్లి దత్తత తదితర పరిణామాల తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరగడంతో రైతులు తమ భూములపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే హద్దులు చెరిగిపోయి వివాదం తెరపైకి వచ్చింది. వెంకటాపూర్ రైతుల భూముల్లో కొంత భాగం పాండురంగ రిజర్వాయర్, రోడ్లు, కాలువలకు పోగా, మిగతా భూమిని ఎర్రవల్లిలో కలిపేశారనేది వెంకటాపూర్ గ్రామస్తుల వాదన. కేసీఆర్ రాకముందు ఈ వాదనను ఎర్రవల్లి గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం ఈ అంశంపై రాజకీయ వర్గాల్లోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సర్వేకు లైన్​ క్లియర్​ అయిన నేపథ్యంలో.. ఏళ్ల తరబడి ఉన్న ఈ ‘తెగని పంచాయితీ’ కొలిక్కి వస్తుందో లేదో వేచి చూడాలి.