యథేచ్ఛగా ‘సిజేరియన్’ వ్యాపారం

ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు అధికంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అనవసర ఆపరేషన్లపై తనిఖీలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Asifabad C-section  Deliveries
Asifabad Government Hospital
Published on: 

ఆసిఫాబాద్, ప్రభాత ఉదయం: ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు సిజేరియన్ దందాకు తెరలేపాయి. అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిజేరియన్ల పేరిట ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరలేపుతున్నారని సమాచారం. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో 80 శాతం వరకు సిజేరియన్లే జరుగుతున్నాయని సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, కొన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అదే అదునుగా భావించి సాధారణ కాన్పులకూ సిజేరియన్లుచేసి ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. సిజేరియన్లు భవిష్యత్‌లో మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

సిజేరియన్ ఫీజు 50వేలు
ప్రైవేటు ఆస్పత్రులు ఒక్క సిజేరియన్ కాన్పుకు దాదాపు రూ. 40 నుండి 50 వేలు ఫీజు వసూలు చేస్తున్నట్టు సమాచారం. కొన్ని సార్లు రూ. 60 వేలు కూడా బిల్లు అవుతున్నది. ఆదివాసుల జిల్లాలో ఇది పెద్ద వ్యాపారంగా మారిపోయింది. బిడ్డ అడ్డం తిరిగిందని, నీళ్లు మింగిందని సాకులు చెప్తూ సిజేరియన్  కాన్పులు చేస్తున్నారని గర్భిణులు వాపోతున్నారు. సిజేరియన్లు జరిగేలా ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆపరేషన్ ద్వారా పుట్టిన బిడ్డలు మృతిచెందిన ఘటనలూ నమోదవుతున్నాయి. బాధితులు ఆందోళనకు దిగి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. సిజేరియన్ సమయంలో రక్తస్రావం ఎక్కువై.. ఇతర ఆరోగ్య సమస్యలతో ప్రాణానికే ముప్పు వాటిల్లుతున్నది. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సర్కార్ ఆస్పత్రులే ఆదర్శం
ఆసిఫాబాద్ జిల్లాలో సాధారణ కాన్పుల్లో ప్రభుత్వ ఆస్పత్రులు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు సాధారణ ప్రసవాల్లో వెనకబడిన ఆస్పత్రుల్లో ఇప్పుడు ప్రసవాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. జిల్లా కలెక్టర్ కే హరిత ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ.. గర్భిణులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో  అనవసరంగా సిజేరియన్లు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో నాగేంద్ర తెలిపారు. కాన్పుల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకే రావాలని.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దని కోరారు.

ఈ ఏడాది ప్రసవాల వివరాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం కాన్పులు: 1082

సాధారణ కాన్పులు : 1061

సిజేరియన్లు :  21

ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం కాన్పులు : 462

సాధారణ కాన్పులు : 115

సిజేరియన్లు:  347