నా భార్య ఓటు తీసేయండి.. బీఎల్ఓకి చనిపోయిన వ్యక్తి దరఖాస్తు

Fake Form-7 in Musheerabad
Fake Form-7 in Musheerabad
Published on: 

నా భార్య చనిపోయింది.. తన ఓటు ఓటర్ లిస్టు నుంచి తొలగించండి అంటూ కనిపించిన దరఖాస్తు నగరంలో ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇందులో వింతేంటంటే.. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కూడా చనిపోయి ఐదేళ్లు అవుతోంది.

భోలక్ పూర్ డివిజన్‌లో ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన రఫీకుద్దీన్ పేరిట తన భార్య సుల్తానా ఓటు రద్దు చేయాలంటూ.. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కు దరఖాస్తు వచ్చింది. అధికారులు చేపట్టిన విచారణలో సుల్తానా బతికే ఉన్నట్టుగా తెలియడంతో ఈ నకిలీ దరఖాస్తు విషయం బయటపడింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి, భాద్యులపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

మొదటి ఘటన మరవకముందే..

ఇప్పటికే ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ లోని 210 పోలింగ్ కేంద్రంలో 310 మంది ఓట్లు రద్దు చేయాలంటూ బిజెపికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్ పెట్టిన బోగస్ దరఖాస్తులు బయటపడ్డాయి. సదరు బీఎల్ఏపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటనను మరవకముందే మరో నకీలీ ఫారం-7 బయటపడడంపై అది కూడా చనిపోయిన వ్యక్తి పేరిట దరఖాస్తు ఉండటం అనుమానాలకు తావిస్తోంది.