

ప్రభాత ఉదయం : భూ భారతి చట్టం కింద ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఆర్భాటంగా చేపట్టిన రీసర్వే పూర్తయినా, తదుపరి ప్రక్రియ అసంపూర్తిగా మిగిలింది. రీ సర్వే పూర్తయినట్లు సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఆ తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియను రెవెన్యూ శాఖ పూర్తి చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పట్టాదారు పాస్‌బుక్కులు జారీ చేయకపోవడంతో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మిగిలిన ప్రక్రియను పూర్తి చేస్తే భూముల క్రయవిక్రయాలకు అవకాశం ఉంటుందని రైతులు తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘ధరణి’ స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం భూముల రీసర్వే చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లాలోని గండీడ్ మండలం సాలార్ నగర్, జగిత్యాల జిల్లాలో భీర్పూర్, ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, ములుగు జిల్లాలో వెంకటాపురం, సంగారెడ్డి జిల్లా షాహిద్ నగర్ గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ ఐదు గ్రామాల్లో డిజిటల్ సర్వే నిర్వహించి, రైతుల భూముల వివరాలతోపాటు మ్యాప్ జతచేసి కొత్త పాస్‌బుక్కులు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2025 మే 24 నుంచి ఐదు గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. భూముల డిజిటల్ మ్యాపింగ్ చేపట్టారు. సర్వే నంబర్ల వారీగా క్షేత్రస్థాయిలో హద్దులను నిర్ధారించి, పాత రికార్డులతో సరిపోల్చారు. గ్రామానికి ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్, నలుగురు సర్వేయర్లను కేటాయించారు. డ్రోన్ కెమెరాలతో గ్రామ పటం రూపొందించి, డిజిటల్ విధానంలో సర్వే నంబర్ల వారీగా ప్రతి రైతు భూమికి హద్దులు నిర్ణయించారు. ఐదు గ్రామాల్లో సర్వే పూర్తి చేసి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.
ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు..
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రతి రైతుకు కొత్త పట్టాదారు పాస్బుక్కు జారీ చేయాలి. అందులో భూమి సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను పొందుపర్చాలి. అయితే, కొలతల్లో పాస్‌బుక్కుల్లో ఉన్నదానికంటే తక్కువ భూమి చూపించడంతో పలు గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్లకు ఫిర్యాదులు చేశారు. రీ సర్వే తర్వాత ప్రభుత్వ భూముల విస్తీర్ణంలోనూ చాలా వ్యత్యాసాలు వెలుగుచూశాయి. డిజిటల్ సర్వేను మెజారిటీ రైతులు స్వాగతించినప్పటికీ.. కొందరు వ్యతిరేకిస్తున్నారు. సర్వే అనంతరం చేపట్టాల్సిన ప్రక్రియను రెవెన్యూ శాఖ పూర్తి చేయడం లేదు. దీంతో ఐదు గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో భూములు విక్రయించేందుకు సిద్ధమైనా, కొనుగోలు చేయడానికి వచ్చినవారు రిజిస్ట్రేషన్లు జరగక వెనుదిరుగుతున్నారు. గ్రామాల్లో రీ సర్వే విజయవంతంగా జరుగుతోందని చెబుతున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ ఐదు గ్రామాల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
సరిహద్దులు చూపించలే..
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని షాహిద్ నగర్లో రీసర్వే పూర్తి చేశారు. గ్రామ సరిహద్దులు, గ్రామకంఠం, మ్యాప్ వంటివి అందుబాటులో లేకపోవడంతో అధికారులు డ్రోన్, రోవర్ సర్వే నిర్వహించారు. రైతుల వారీగా భూముల అనుభవం, హద్దుల ఆధారంగా సర్వే చేపట్టారు. రికార్డుల్లో ఉన్న భూమి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమిని కొలిచి హెచ్చుతగ్గులను గుర్తించారు. ఈ సర్వే ఆధారంగా గ్రామంలోని ఇళ్లు, రహదారులు, వ్యవసాయ భూముల విస్తీర్ణాన్ని గుర్తించారు. మొత్తం 21 సర్వే నంబర్లలో 592.01 ఎకరాల భూమి ఉన్నట్లు లెక్క తేల్చారు. గ్రామంలోని ఇళ్లు, అంతర్గత రహదారులు కలిపి 13.38 ఎకరాలు, రాష్ట్ర రహదారి 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించారు. మిగతా 555 ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉన్నట్లు నిర్ధారించారు. ఇందులో 279 మంది రైతులు పట్టాదారులుగా ఉన్నారు. ఈ భూములకు సంబంధించిన రైతులకు భూఆధార్ నంబర్లు కూడా కేటాయించారు. గ్రామ మ్యాప్‌ను అధికారులు నిర్ధారించారు. కానీ ఇప్పటివరకు రైతులకు సరిహద్దులను చూపించలేదు. రికార్డుల్లోని వివరాలతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న భూమి వివరాలను రెండు రోజుల క్రితం మౌఖికంగా తెలియజేశారు. రికార్డుల ప్రకారం ఎక్కువ భూమి ఉండి, క్షేత్రస్థాయిలో తక్కువగా ఉన్నట్లు తేలిన రైతులు ఈ సర్వేను వ్యతిరేకిస్తున్నారు.
కాలువలు, రహదారులను తొలగించకుండానే..
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సాలార్ నగర్ గ్రామంలో పాత రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, డిజిటల్ సర్వేలో గుర్తించిన భూమికి మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టాదారు పాస్‌బుక్కుల్లో ఉన్నదానికంటే తక్కువ భూమి ఉన్నట్లు తేలడంతో పలువురు రైతులు సర్వేను అడ్డుకున్నారు. కొన్ని భూముల్లో కాలువలు, రహదారులు ఉన్నప్పటికీ వాటిని సర్వేలో తొలగించలేదని, ఆ భూముల విస్తీర్ణం అదనంగా కలిసిందని రైతులు అధికారులకు వివరించినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. గ్రామంలో మొత్తం 420 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 62 మంది రైతులకు రికార్డుల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్నట్లు తేలడంతో తప్పుడు సర్వే చేశారని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్‌లో 48 మంది శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లను సాలార్ నగర్‌కు పంపించారు. వీరు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. రీ సర్వే ప్రకారం పట్టాదారు పాస్‌బుక్కులు జారీ చేస్తామని ఆగస్టు చివరి వారంలో గ్రామంలో నోటీసు అంటించారు. భూముల కొలతలు, సరిహద్దుల్లో అవకతవకలు ఉన్నాయని, మరోసారి సర్వే చేయాలని కలెక్టర్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు. అయినా ఇప్పటివరకు ఆ పని చేయలేదని రైతు చెన్నారెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులు రాడార్ ద్వారా సర్వే చేయడంతో సరిహద్దులు సక్రమంగా లేవని ఆయన ఆరోపించారు.
ఎల్పీఎం నంబర్లు లేక..
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో డిజిటల్ సర్వే నిర్వహించి దాదాపు ఏడాది కావస్తోంది. సర్వే పూర్తిచేసినా రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్కులు ఇవ్వలేదు. పాత సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఎం నంబర్లు కేటాయించారు. వాటిని ముద్రించకపోవడంతో భూముల క్రయవిక్రయాలు, పేరు మార్పిడి జరగడం లేదు. రైతులు పాస్‌బుక్కులను రుణాల కోసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. వాటిని తిరిగి అప్పగిస్తేనే ఎల్పీఎం నంబరు ముద్రిస్తామని అధికారులు చెబుతుండగా, రుణ బకాయిలు చెల్లిస్తేనే పాస్‌బుక్‌లు ఇస్తామని బ్యాంకర్లు అంటున్నారు. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. తమకు ప్రభుత్వం అప్పగించిన రీ సర్వే పనిని తాము పూర్తి చేశామని, తరుపరి ప్రక్రియ రెవెన్యూ శాఖ పూర్తిచేయాల్సి ఉందని సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు.