గిట్టుబాటు కాదు.. భారం తప్పదు!

పత్తి రైతుల పరిస్థితి దయనీయం
Cotton Farmers
Farmers in Narayanpet are concerned over the drop in cotton prices
Published on: 

ప్రభాత ఉదయం, నారాయణపేట: ఓ వైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు పంట సాగుకు పెట్టుబడి భారంతో ఆందోళన చెందుతున్న రైతులు ధరాఘాతంతో కుంగిపోతున్నారు. మార్కెట్​లో పంట అమ్ముదామని వెళ్తే.. మిల్లర్లు సిండికేట్​ కావడంతో గిట్టుబాటు ధర దక్కక నరకయాతన పడుతున్నారు.

నారాయణపేట జిల్లాలో 1,66,447 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. 10,66,004 క్వింటాళ్ల పత్తి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తోంది. ఏటా పంట సాగుకు పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఎకరంలో పంట సాగుకు సుమారు రూ.80 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడలేదు. దీంతో ఆయిల్ ఇంజిన్లతో నీటి తడులు అందించడంతో ఖర్చు పెరిగింది.

దిగుబడులపై బెంగ

సాధారణంగా ఎకరాకు సుమారు 10 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 5 నుంచి 10 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పత్తి రైతులు దిగుబడులపై దిగాలు చెందుతున్నారు.

ఒక్కటయ్యారు.. తగ్గించారు

నారాయణపేట జిల్లాలో 5 పత్తి మిల్లుల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలు రూ.8,667గా ప్రకటించింది. ఎల్​నినో ప్రభావంతో పంట దిగుబడి తక్కువగా వస్తుందనే అంచనా మేరకు మిల్లర్లు మద్దతు ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేశారు. గత నెల​ 12న పత్తి క్వింటాలు రూ.9,600 పలికింది. 9న రూ.9,300, 30న రూ.9,000 ఉండగా.. ప్రస్తుతం రూ. 8760 పలుకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లు అంతా కలిసి ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.‘‘ఇతర జిల్లాలు, కర్ణాటకలో పత్తి క్వింటాలు రూ.10 వేల కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి మిల్లులపై అధికారుల పర్యవేక్షణ పెరగాలి. లేదంటే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.’’ అని నారాయణపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ‌‌బండి వేణుగోపాల్ పేర్కొన్నారు.

పొరుగున రూ.10 వేలు

నారాయణపేట జిల్లాకు ఆనుకుని ఉన్న కర్ణాటక రాష్ట్రం రాయచూర్​లో పత్తి క్వింటాలు రూ.10,040 పలికింది. గత నెలలో రూ.9,400తో కొనుగోలు చేశారు. రాయచూరుకు పంటను తీసుకెళితే రవాణాకు అయ్యే ఖర్చు భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మిల్లర్లు నాణ్యత, తేమ పేరుతో ధర తగ్గిస్తున్నారని వారు వాపోతున్నారు.