దిష్టి తీసిన ప్రాణాలు

కామారెడ్డి జిల్లా లింగాయిపల్లిలో చెరువులో మునిగి మహిళ, ఆమె తండ్రి మృతి చెందారు. గురువారం రాత్రి జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దిష్టి తీసిన ప్రాణాలు
Published on: 

ప్రభాత ఉదయం, కామారెడ్డి : భర్త ఆరోగ్యం బాగు చేసేందుకు భూతవైద్యుడు చెప్పిన పని చేసే ప్రయత్నంలో ఓ మహిళ తన తండ్రితో పాటు ప్రాణాలు కోల్పోయింది. అనారోగ్యంతో ఉన్న భర్తకు దిష్టి తీసి ఆ వస్తువులను చెరువులో కలిపేందుకు తండ్రితో వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగాయిపల్లిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సోమిశెట్టి మల్లేశ్‌కు ఏడాదిన్నర కింద ప్రమాదం జరగడంతో కాలుకు ఆపరేషన్ చేశారు. అయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. అతడికి నయం చేయాలన్న ఉద్దేశంతో మల్లేశ్ భార్య రజిత (40) తన తండ్రి, టేక్రియాల్‌కు చెందిన సుంకరి పెద్ద నర్సింలు (60)తో కలిసి గురువారం ఓ భూతవైద్యుడిని కలిసింది. అతడు ఇచ్చిన కొన్ని వస్తువులను తీసుకొని వచ్చి వాటితో మల్లేశ్‌కు దిష్టి తీసింది. ఆ వస్తువులను తమ ఊరికి సమీపంలో ఉన్న కోటాలుపల్లి చెరువులో కలిపేందుకు రాత్రి 10 గంటలకు రజిత, నర్సింలు వెళ్లారు. అర్ధరాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూడగా ఒడ్డున చెప్పులు కనిపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం చెరువులో గాలించగా ఇద్దరి శవాలు దొరికాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు.