ఫోర్త్ సిటీపై ఆరోపణలు అవాస్తవం.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఎఫ్‌సీడీఏ కౌంటర్!

ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)పై ఆరోపణలు అవాస్తవమని ఎఫ్‌సీడీఏ ఎన్‌జీటీకి తెలిపింది. టెండర్లు కేవలం మాస్టర్ ప్లాన్ కోసమేనని, భవిష్యత్తులో నిబంధనల ప్రకారమే అనుమతులు పొందుతామని స్పష్టం చేసింది.
Future City Development Authority
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రాజెక్టుపై పిటిషనర్‌ చేసిన ఆరోపణలు అవాస్తవమని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎదుట ‘ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ’ కౌంటర్‌ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం 1975 నాటి పట్టణ ప్రాంతాల చట్టం ప్రకారం, 2025 మార్చి 12న జీవో ఎంఎస్ నంబర్ 69 ద్వారా ప్రత్యేక ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిందని తెలిపింది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం 56 రెవెన్యూ గ్రామాల్లో 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ సంస్థ పనిచేస్తోందని పేర్కొంది. పిటిషనర్ ఆరోపణల్లో పేర్కొన్న ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, పర్యావరణ అనుమతులు అవసరమయ్యే ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టడం లేదని ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. చట్టప్రకారం అవసరమైన అన్ని పర్యావరణ అనుమతులను తగిన సమయంలో పొందుతామని ధర్మాసనానికి హామీ ఇచ్చారు.

మాస్టర్ ప్లాన్‌ కోసమే టెండర్లు

ఫోర్త్‌ సిటీ పేరుతో ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా టెండర్లు పిలవడం, పనులు చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ సామాజిక కార్యకర్త దొంతి నరసింహారెడ్డి ఎన్‌జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ‘‘ఎఫ్‌సీడీఏ జారీ చేసిన టెండర్‌ను మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్‌ను ఎంపిక చేయడం కోసమే పిలిచాం. ఈ టెండర్ మౌలిక వసతుల నిర్మాణం, టౌన్‌షిప్ అభివృద్ధి లేదా ఇతర నిర్మాణ పనులకు సంబంధించినది కాదు’’ అని అఫిడవిట్‌లో ప్రభుత్వం తెలిపింది. ‘‘ఎఫ్‌సీడీఏ కార్యాలయ భవనం కూడా కేవలం సంస్థ పరిపాలనా అవసరాల కోసమే. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేటలో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.19 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను పారదర్శక ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఖరారు చేశాం. పిటిషనర్‌ ప్రస్తావించిన కొన్ని ఫొటోలు ఎఫ్‌సీడీఏ ప్రాజెక్టు పనులుగా చిత్రీకరించడం సరికాదు. ఇది తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టు మాత్రమే’’ అని కౌంటర్‌లో వివరించారు. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను ఎన్‌జీటీ నవంబరు 17కు వాయిదా వేసింది.