భద్రాద్రిలో జ్వరాల జోరు.. వైద్య సదుపాయాలు బేజారు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల పల్లెలను జ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరంతో పలువురు మృతిచెందిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Bhadradri Kothagudem fever cases and deaths
Published on: 

ప్రభాత ఉదయం, భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల పల్లెలను జ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరంతో పలువురు మృతిచెందిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అన్నపురెడ్డిపల్లి మండలం కొండాయిగూడెంలో కాకా అఖిల్ (8), పాల్వంచ మండలం పునుకులలో పిట్టల రమణ (52), టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో బానోత్ రమేశ్ (38) ఇటీవల మరణించారు. ఈ ఘటనలతో మన్యం ప్రాంతంలో ప్రజారోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు వైద్యుల కొరత, నిధుల లేమి, అందుబాటులోకి రాని కంటైనర్ ఆసుపత్రులు ప్రజారోగ్య వ్యవస్థలోని సమస్యలను ఎత్తిచూపుతున్నాయి.

జ్వరాల బారిన 2 లక్షల మందికిపైగా..

జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 2,03,399 మంది జ్వరాల బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో 27 మందికి డెంగ్యూ, 47 మందికి మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇవి ప్రభుత్వ వైద్యశాలల్లో నమోదైన కేసుల లెక్కలు మాత్రమే. మారుమూల గ్రామాల్లో జ్వరాల తీవ్రత, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్యపై స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు. మరోవైపు వాతావరణ మార్పులే జ్వరాల వ్యాప్తికి కారణమని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీధర్ పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జ్వరపీడితుల సంఖ్య తగ్గిందని, గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులు ఇందుకు దోహదపడ్డాయని తెలిపారు. జ్వరాలతో నమోదైన మరణాలన్నీ వాటి కారణంగానే సంభవించలేదని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారూ మరణించినట్లు వివరించారు.

పీహెచ్‌సీలను పట్టిపీడిస్తున్న సమస్యలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) వైద్యుల కొరతతో సతమతమవుతున్నాయి. వీటిలో 74 మంది మెడికల్ ఆఫీసర్లు విధులు నిర్వహించాల్సి ఉండగా.. ప్రస్తుతం 35 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. మరో 35 మంది పీజీ చదువుల కోసం వెళ్లడంతో వైద్య సేవలపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు పీహెచ్‌సీల నిర్వహణకు అవసరమైన హాస్పిటల్ డెవలప్‌మెంట్ స్కీం (హెచ్‌డీఎస్) నిధులూ అందడం లేదు. ఒక్కో పీహెచ్‌సీకి కనిష్ఠంగా రూ.1.50 లక్షలు, గరిష్ఠంగా రూ.2.50 లక్షలు కేటాయించాల్సి ఉండగా.. గత ఐదేళ్లుగా ఈ నిధులు విడుదల కావడం లేదని అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ సైదులు తెలిపారు. దీంతో నిర్వహణ ఖర్చుల కోసం వైద్యాధికారులు తమ జీతాల నుంచే డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని వివరించారు.

మలేరియా నివారణకు నిధుల కొరత

జిల్లా మలేరియా విభాగానికి ఏటా రావాల్సిన రూ.33 లక్షల నిధులు అందకపోవడం నివారణ చర్యలకు ఆటంకంగా మారింది. జిల్లాలో 119 హైరిస్క్ గ్రామాలు, 214 మలేరియా ప్రభావిత గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో మూడు దశల్లో మలేరియా నివారణ మందును పిచికారీ చేయాల్సి ఉంటుంది. అయితే, అవసరమైన నిధులు అందకపోవడంతో భద్రాచలం ఐటీడీఏ పీవో రూ.12 లక్షలు విడుదల చేశారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వాటిని విడుదల చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులోకి తేవడంతోపాటు, పీహెచ్‌సీలకు అవసరమైన నిధులు, మలేరియా నివారణకు సరిపడా వనరులు సమకూర్చాల్సిన అవసరం ఉంది.

కంటైనర్ ఆసుపత్రులు సిద్ధం.. సిబ్బంది ఏరీ?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల గ్రామాలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు ప్రభుత్వం గతేడాది కంటైనర్ ఆసుపత్రులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఆళ్లపల్లి, గుండాల, పర్ణశాల, వినాయకపురం ప్రాంతాల్లో కంటైనర్లను ఏర్పాటు చేశారు. అయితే, వాటికి అవసరమైన వైద్య సిబ్బంది, పరికరాలను సమకూర్చకపోవడంతో ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీధర్ తెలిపారు. సిబ్బందిని నియమిస్తే గ్రామాల్లోనే మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించడంతోపాటు వ్యాధులను నిర్ధారించి చికిత్స అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. జ్వరాలతో మన్యం ప్రాంతం సతమతమవుతున్న నేపథ్యంలో కంటైనర్ ఆసుపత్రులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, అవసరమైన వైద్య సిబ్బంది, పరికరాలను సమకూర్చాలని స్థానికులు కోరుతున్నారు.