అటవీ ఉత్పత్తులపై ఎల్‌నినో దెబ్బ

ఆందోళనలో ఆదివాసులు
El Nino impact on tribals
Published on: 

ప్రభాత ఉదయం , భద్రాద్రి కొత్తగూడెం: 

‘‘అడవిలో ఎక్కడో దూరంగా పోతే కానీ కూరలు దొరకట్లేదు. వానలు లేవు.  ఆకుకూరలు కూడా కష్టంగానే ఉన్నాయి. ఎప్పుడూ ఇట్ల లేదు. వారం వారం సంతల్లో అమ్ముకుంటేనే మాకు డబ్బులు. పుట్టకొక్కులు ఒక్కసారే దొరికినాయి. తర్వాత ఎక్కడా కన్పించడం లేదు. వర్షాలు ఉంటేనే కదా అవి దొరికేది..?’’ ఇదీ ఆదివాసీ మహిళ సావిత్రి ఆవేదన.

ఎల్‌నినో ప్రభావంతో అటవీ ఉత్పత్తులు తగ్గుముఖం పట్టాయి. పండ్లు, పూలు, గింజలు, దుంపలు, పుట్టగొడుగులు (పుట్టకొక్కులు) అందుబాటులో లేక ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. విప్పపువ్వు, చింతపండు, పుట్టగొడుగులు తదితరాల దిగుబడులు స్థానిక వాతావరణానికి అనుగుణంగా మారుతుంటాయి.  ఈ ఉత్పత్తులను సేకరించి విక్రయిస్తూ జీవనం సాగించే ఆదివాసీలకు ఆశించిన స్థాయిలో ఆదాయం దక్కక ఆవేదన చెందుతున్నారు.

సంతల్లో అరకొరే..

గోదావరి లోయలోని దండకారణ్యంలో ఉన్న భద్రాచలం మన్యం వారపు సంతలు ఆదివాసీలకు ప్రధాన ఆదాయ వనరు.  అడవుల నుంచి సేకరించే కూరలను వారపు సంతల్లో అమ్ముకుని ఉపాధి పొందుతారు. ఈ సీజన్లో దొరికే పలు కూరల జాడే లేదు. ప్రధానంగా పుట్టగొడుగులు ఎక్కువగా దొరుకుతాయి. ఎల్‌నినో కారణంగా అవి అందుబాటులో లేవని ఆదివాసీలు చెబుతున్నారు. తామర, ఇతర దుంపలు కూడా రావట్లేదు. చింతపండు, విప్పపువ్వు, బుడమ కాయలు, వెదురుకొమ్ములు, నారదుంప, అడవి ఎలేరి దుంప, నాగేల్మాటి దుంప, నోస్కామాటి దుంప, వెలగ తదితరాలు అరుదుగా కన్పిస్తున్నాయి.

ఆహార భద్రతపై ప్రభావం

అటవీ ప్రాంతంలో పెరిగే 172 రకాల మొక్కలు ఆదివాసీలకు ఆహారంగా ఉపయోగపడతాయని ఒక అధ్యయనంలో గుర్తించారు. అవి కుటుంబ ఆదాయానికి కూడా తోడ్పడుతున్నాయి. ఆదివాసీల ఆహారభద్రతలో ఇవి ఎంతో కీలకమైనవి. ఎల్‌నినో ప్రభావంతో వాటి లభ్యత అరుదుగా మారింది. సేకరణకు దట్టమైన అడవి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వరుసగా వర్షాభావం ఏర్పడితే కొన్ని జాతుల మొలకలు, ఎదుగుదల దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అటవీ సంపదకు విఘాతం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.  

‘‘వారపు సంతల్లో ఈసారి పుట్టకొక్కులు కన్పించడం లేదు. కనీసం మూడు నెలల పాటు గిరిజనులు సంతల్లో అమ్ముతుంటారు. ఇప్పుడు దొరకట్లేదని వారు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం ఇప్పుడే మొదలైంది. సర్వే చేస్తున్నాం. రాబోయే సీజన్లో దొరికే అటవీ ఉత్పత్తులు కూడా ఈసారి తగ్గే ప్రమాదం ఉంది.’’ అని జన్‌వికాస్ సొసైటీ అధ్యక్షుడు జట్వాడి వెంకటేశ్ చెబుతున్నారు.