విప్లవ నేతల రాజకీయ బాట

Telangana Former Maoist New Party
Published on: 

తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటమే ఏకైక లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్త రాజకీయ పునరేకీకరణ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మాజీ మావోయిస్టు నేతలు ఇందులో కీలకపాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ లక్ష్య సాధన కోసం ఇప్పటికే జన తెలంగాణ పార్టీ పురుడుపోసుకోగా, త్వరలో విశాల ఐక్య వేదిక ఏర్పాటు చేయనున్నట్లు మాజీ మావోయిస్టు నేతలు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తోపాటు అంతర్గత విభేదాల మూలంగా మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. చాలామంది కీలక నేతలు మరణించగా, దేవ్ జీ, సంగ్రామ్, చంద్రన్న, సోనూ, సతీష్‌ వంటి నేతలు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇప్పుడు వారంతా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా మాజీ మావోయిస్టు నేతలు లంకా పాపిరెడ్డి, బల్లా రవిందర్, గురిజాల రవిందర్ తదితరులు సెప్టెంబర్ 19న జన తెలంగాణ పార్టీ పేరిట ఓ రాజకీయ వేదికను స్థాపించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం సహా ఏడు అంశాలను తమ సిద్ధాంతాలుగా ప్రకటించిన ఈ పార్టీ ఇప్పటికే కార్యక్షేత్రంలోకి దిగింది. ఈ నేపథ్యంలో జన తెలంగాణ పార్టీతో తమకు సంబంధం లేదని ప్రకటించిన మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు దేవ్ జీ, సంగ్రామ్ తామూ త్వరలో కొత్త రాజకీయ ప్రజాఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

విశాల ఐక్య వేదిక ఏర్పాటు

కొత్త రాజకీయ వేదికను స్థాపిస్తున్నట్టు ప్రకటించిన దేవ్ జీ, సంగ్రామ్, చంద్రన్న తమతో కలిసి పని చేసేందుకు ముందుకురావాలని తెలంగాణలోని మావోయిస్టు నేతలకు పిలుపినిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడే క్రమంలో జన తెలంగాణ పార్టీ సహా ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు తాము సిద్ధమేనని దేవ్ జీ బృందం ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో విప్లవ నేతల రాజకీయ పయనం ఎలా ఉంటుందోననే అంశం ఆసక్తికరంగా మారింది.

మరణశిక్ష రద్దు చేయాలని వినతి

జీరం ఘాటి కేసులో 10 ఆదివాసీలకు ఎన్ఐఏ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని మాజీ మావోయిస్టు నేతలు ఓ సంయుక్త ప్రకటనలో కోరారు. ఆదివాసీలను జైలు నుంచి విడుదల చేయాలని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాలని ప్రతిపక్ష పార్టీలను కోరారు. న్యాయ సహాయం చేసేందుకు ముందుకురావాలని న్యాయవాదులను విన్నవించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ నేతలు దేవ్ జీ, సంగ్రామ్, చంద్రన్న, మైనక్క, సంజీవ్, ముప్పిడి సాంబయ్య, దామోదర్, హుస్సేన్, బండి ప్రకాష్, నరహరి, నూన నర్సింహారెడ్డి, చందు, కంకణాల రాజిరెడ్డి సంయుక్త ప్రకటన విడుదల చేశారు.