నీళ్లివ్వకుంటే బ్రిడ్జిపై నుంచి దూకుతా..

కరీంనగర్‌, చొప్పదండి రైతులకు సాగునీరు అందించాలని గంగుల కమలాకర్‌ డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ డీ-86 కెనాల్‌ వద్ద నిరసన అనంతరం 300 క్యూసెక్కుల నీటి విడుదలకు కృషి చేశారు.
Gangula Kamalakar
Gangula Kamalakar
Published on: 

ప్రభాత ఉదయం, చొప్పదండి: కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల రైతులకు సాగునీరు ఇవ్వకుంటే బ్రిడ్జిపై నుంచి దూకుతానని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.  చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రైతులతో కలిసి ఎస్సారెస్పీ డీ-86 కెనాల్ వద్ద బుధవారం నిరసనకు దిగారు.  ఆ తర్వాత అధికారులతో చర్చలు జరిపి 300 క్యూసెక్కుల నీటి విడుదలకు కృషి చేశారు. అంతకుముందు చొప్పదండి చౌరస్తా నుంచి రైతులతో కలిసి ట్రాక్టర్‌ నడుపుతూ కెనాల్‌ వద్దకు చేరుకున్నారు. సాగునీరు అందక పంటలు దెబ్బతింటున్నా అధికారులు స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. పోలీస్, ఎస్సారెస్పీ అధికారులతో చర్చలు జరుపుతూనే రైతులతో కలిసి గంగుల రెగ్యులేటరీ గేట్ల వద్దకు చేరుకున్నారు. రైతులకు నీరందించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

వివక్ష తగదు: గంగుల

రైతులకు సాగునీటి పంపిణీలో వివక్ష చూపడం తగదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. పెద్దపల్లి ప్రాంతానికి అందించినట్లే తమ ప్రాంత రైతులకు కూడా సాగు నీరివ్వాలని డిమాండ్ చేశారు. గతంలో కాళేశ్వరం జలాల రాకతో ఎస్సారెస్పీతో పాటు వివిధ రిజర్వాయర్లు, కాలువల్లో నీటి లభ్యత పెరిగిందని గుర్తుచేశారు.  ఎస్సారెస్పీ నీటిని సాగు, తాగు అవసరాలకు  వినియోగిస్తున్నారని తెలిపారు. అలాంటప్పుడు కరీంనగర్‌, చొప్పదండి ప్రాంతాల రైతులకు సాగునీరు అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. డీ-83, డీ-86 కెనాళ్లకు సరిపడా నీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలను కాపాడుకోవడానికి నీటి కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నీటిని తిరిగి నిలిపివేస్తే మరోసారి ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. రెండు జిల్లాల కలెక్టర్లు సమన్వయం చేసుకొని రైతులకు సాగు నీరు అందేలా చూడాలని కోరారు.

రైతులను విస్మరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం: సుంకె రవిశంకర్‌

రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థంగా వినియోగించుకొని సాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రైతుల సమస్యలపై కనీసం సమీక్ష నిర్వహించడం లేదని, అన్నదాతలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కరీంనగర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌ గౌడ్‌, చొప్పదండి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం చొక్కారెడ్డి, సర్పంచ్ బందారపు అజయ్, మాచర్ల వినయ్ కుమార్, కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గాల బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులు పాల్గొన్నారు.