రామయ్యా.. పనులు పూర్తి కావేమయ్యా!

భద్రాచలంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన ఘాట్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు ఆలస్యం కావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.
Bhadrachalam Godavari Pushkaralu
Bhadrachalam Godavari Pushkaralu Development Works Delay
Published on: 

కొత్తగూడెం, ప్రభాత ఉదయం: గోదావరి పుష్కరాలను 2027 జూన్​ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముహూర్తం ముంచుకొస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. రూ.68.8 కోట్లు కావాలంటూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపిస్తే రూ.46.65 కోట్లు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. వచ్చిన నిధులతో చేపట్టిన పనులు ప్రారంభోత్సవానికే పరిమితమయ్యాయి. సుమారు కోటి మంది భక్తులు పుష్కర స్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు.  క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు మాత్రం అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి.

క్షేత్రస్థాయిలో ఇలా..

జిల్లాలోని భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ప్రవహించే గోదావరి తీరంలో భద్రాచలం, బూర్గంపాడు మండలం మోతె, మణుగూరు మండలం చిన్నరావిగూడెం, రామానుజవరం, దుమ్ముగూడెం మండలం పర్ణశాల, వెంకటాపురం మండలం రామచంద్రాపురంలో స్నానఘట్టాల్లో పనులకు రూ.46.65 కోట్లు మంజూరయ్యాయి. భద్రాచలంలో ప్రస్తుతం ఉన్న స్నానఘట్టాలకు ఇరువైపులా 400 మీటర్ల చొప్పున కొత్త ఘాట్లు నిర్మించనున్నారు. ఇక పాత ఘాట్లపై ఉన్న సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలను పునరుద్ధరించనున్నారు. మోతె, చిన్నరావిగూడెం, రామానుజవరం, పర్ణశాల, రామచంద్రాపురం ఘాట్లకు రిపేర్లు చేపడుతున్నారు. షవర్లు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులు, విద్యుద్దీపాలు ఏర్పాటుచేయనున్నారు. ఇవన్నీ ఇరిగేషన్ శాఖ మాత్రమే పనులు చేపడుతోంది. టెండర్ల పూర్తితోపాటు అగ్రిమెంట్లు కూడా అయ్యాయి. భూమి పూజ చేసి వదిలేశారు. భద్రాచలంలో ఘాట్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. కరకట్టపై ఉన్న రోడ్డును కూడా విస్తరించాల్సి ఉన్నది. ‘రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తాం.  పుష్కరాల నాటికి అందిస్తాం’ అని ఇరిగేషన్ ఈఈ జానీ చెబుతున్నారు. ఎండోమెంట్ డిపార్ట్​మెంట్​కు రూ.1.50 కోట్లు రిలీజ్ అయ్యాయి. వాటితో భద్రాచలం అంబసత్రం సమీపంలో డార్మెటరీ హాల్ నిర్మిస్తున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి పుష్కరఘాట్ నిర్మాణానికి భూమి పూజ జరిగినా పనులు జరుగని పరిస్థితి
భద్రాచలం వద్ద గోదావరి పుష్కరఘాట్ నిర్మాణానికి భూమి పూజ జరిగినా పనులు జరుగని పరిస్థితి

కొత్త ప్రతిపాదనలకు మోక్షం ఎప్పుడో..

పర్ణశాల రాముని సన్నిధిలో పాత పుష్కరఘాట్​కు మరమ్మతులు చేస్తున్నారు. దుమ్ముగూడెంలో కొత్తగా రూ.5.60 కోట్లతో ఘాట్​ను నిర్మిస్తున్నారు. అశ్వాపురం మండలం చింతిర్యాలలో రూ.2.25 కోట్లతో, పినపాక మండలం చింతల బయ్యారంలో రూ.2.25 కోట్లతో, వెంకటాపురం మండలం మరికాలలో రూ.2 కోట్లతో ఘాట్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించారు.  నేటికీ వాటికి మోక్షం కలుగలేదు.

అక్టోబర్​లోనే ఎడారిని తలపిస్తున్న భద్రాచలం వద్ద గోదావరి
అక్టోబర్​లోనే ఎడారిని తలపిస్తున్న భద్రాచలం వద్ద గోదావరి

కేంద్ర పథకమైనా పూర్తయ్యేనా..?

కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రసాద్ స్కీమ్​ ద్వారా రూ.41.30 కోట్లు కేటాయించింది. ఆ సంవత్సరం డిసెంబర్​ 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూమి పూజ  చేశారు. గోదావరి వంతెన సమీపంలో రూ.3.45 కోట్లతో పెద్ద హోటల్​ నిర్మించారు. కానీ, నేటికీ దేవస్థానానికి అప్పగించలేదు. మిథిలా స్టేడియం వెనుక రూ.11 కోట్లతో వ్రత మండపం నిర్మిస్తున్నారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో రూ.7.50 కోట్లతో చేపట్టిన పనులు కూడా పూర్తికాలేదు. కనీసం పుష్కరాలకైనా అందిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు.   

నిధులు విడుదలైనప్పటికీ గోదావరి కరకట్టపై ప్రారంభం కాని విస్తరణ పనులు
నిధులు విడుదలైనప్పటికీ గోదావరి కరకట్టపై ప్రారంభం కాని విస్తరణ పనులు

ప్రస్తుత నీటిమట్టం 6 అడుగులే..

ఈనెల 26న ఉదయం 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 6 అడుగులు మాత్రమే ఉన్నది. ఇది కేవలం 15,538 క్యూసెక్కుల ప్రవాహమే. ఎల్​నినో ప్రభావం ప్రస్ఫుటంగా కన్పిస్తోంది. ఇక రాబోయే వేసవికి ఎడారిని తలపించే అవకాశం ఉన్నది. జూన్ నెలాఖరు నుంచే పుష్కరాలు ప్రారంభం కావాల్సి ఉన్నది. ఇవే ప్రతికూల పరిస్థితులు కొనసాగితే పుష్కరస్నానాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతున్నది.