గోదావరి పుష్కర పనులను సకాలంలో పూర్తి చేయాలి

Godavari Pushkaralu
Godavari pushkaralu 2027 preparations review meeting by district collector Ankit
Published on: 

- అన్ని శాఖల సమన్వయం అవసరం: కలెక్టర్ అంకిత్

- ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు: జిల్లా ఎస్పీ

ప్రభాత ఉదయం, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలోని పుష్కర ఘాట్ల వద్ద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖ, సీపీవో కార్యాలయం నుంచి పుష్కరాల కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఎస్పీ రోహిత్ రాజు, సీపీవో సునీతలను ఆదేశించారు. గోదావరి పుష్కరాల పనుల పర్యవేక్షణకు భద్రాచలం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్‌ను నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కరాలకు మరో పది నెలల సమయం మాత్రమే ఉన్నందున పనుల పురోగతిని నోడల్ అధికారికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు.

దుమ్ముగూడెం, పర్ణశాల, మోతేపట్టినగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్లకు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించారు. పుష్కరాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్, అప్రోచ్ రోడ్లు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు తదితర మౌలిక వసతులను ముందస్తుగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

2015లో నిర్వహించిన గోదావరి పుష్కరాలకు సంబంధించిన వివరాలను సేకరించి సమగ్ర నివేదికతోపాటు సుమారు 30 పేజీల ప్రత్యేక బుక్‌లెట్‌ను రూపొందించాలని సీపీవో సునీతను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, పుష్కరాల సమయంలో ట్రాఫిక్, భక్తుల రద్దీని ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డీ వేణుగోపాల్, భద్రాచలం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్, డీఆర్‌వో పద్మావతి, డీపీవో అనూష, డీటీవో భూషిత్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి క్రాంతి కుమార్, కొత్తగూడెం ఆర్డీవో మధు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.