

ప్రభాత ఉదయం, కల్వకుర్తి: కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఇల్లు.. తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమి.. పుట్టిపెరిగిన ఊరు గంగలో కలిసిపోతాయేమోనని నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి కోసం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు తమను నిర్వాసితులను చేస్తోందంటూ పోరుబాట పట్టారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గోకారం వద్ద ప్రతిపాదించిన రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి తమ గ్రామాలను ముంపు నుంచి కాపాడాలనే డిమాండ్ ఏళ్ల నుంచి కొనసాగుతోంది.
ముంపు ముప్పు
రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా గోకారం గ్రామంలో సుమారు 900 ఎకరాలు, ఎర్రవల్లిలో 600 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని గతంలో వార్తలు వెలువడ్డాయి. కానీ ఇవి అధికారిక లెక్కలు కావు. గ్రామాల వారీగా ముంపు విస్తీర్ణం, బాధిత కుటుంబాల సంఖ్యను అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. తొలుత కాల్వల నిర్మాణం కోసం సర్వేలు చేపట్టి.. ఆ తర్వాత రిజర్వాయర్ ప్రతిపాదన తీసుకొచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోతే తమ జీవనాధారం ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
పునరావాసమే కీలకం
గతంలో ఎకరాకు రూ.5.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారని.. వాటితో తమ ఊరిని, వ్యవసాయ భూమిని, తరతరాల అనుబంధాన్ని పొందలేమని వాపోతున్నారు. బాధిత కుటుంబాలు ప్రస్తుత పరిహారం ఎంత? ఎంతమందికి చెల్లించారు? నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారనేది స్పష్టం చేయాలని కోరుతున్నారు. పరిహారం చెల్లించి చేతులు దులుపుకోకుండా రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించే ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల బహిష్కరణ
తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు 2025 నవంబర్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందించారు. డిసెంబరులో రిలే దీక్షలు చేపట్టి, పంచాయతీ ఎన్నికలను సైతం బహిష్కరించారు. 320 రోజులుగా దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సామర్థ్యం తగ్గింపు సాధ్యమేనా!
రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించడం సాంకేతికంగా సాధ్యమా? ప్రత్యామ్నాయ రూపకల్పనతో గ్రామాలను కాపాడవచ్చా? అనే అంశాలను నిపుణులతో పరిశీలించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ముంపు విస్తీర్ణం, భూసేకరణ, పరిహారం, పునరావాస వివరాలను బహిర్గతం చేయాలి. సాగునీటి ప్రయోజనాలతోపాటు నిర్వాసితుల జీవన భద్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి. తమ ఊరిని కాపాడాలంటూ బాధితులు చేస్తున్న ఆర్తనాదానికి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.