

ప్రభాత ఉదయం, యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో కొలువుదీరిన నరసింహస్వామి శాంతిస్వరూపుడుగా దర్శనమివ్వడం యాదగిరిగుట్ట క్షేత్ర ప్రత్యేకత అని రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు స్వామివారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రధానాలయ ముఖ మంటపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసింహస్వామి కొలువైన ఇతర క్షేత్రాల్లో ఉగ్రరూపంలో కనిపిస్తే.. యాదగిరిగుట్టలో అమ్మవారితో కలిసి ప్రశాంతంగా దర్శనమివ్వడం విశేషమన్నారు. సాధారణ రోజుల్లో 15వేల నుంచి 30వేల మంది, వీకెండ్లో 70 వేల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవడం సంతోషదాయకమని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
వేదాల్లో అపారమైన సైన్స్ ఉంది
వేదాల్లో ప్రకృతి పరిరక్షణ, సమగ్ర అభివృద్ధి, నైతిక విలువల జీవన విధానంతో పాటు విశేషమైన శాస్త్రీయ దృక్పథం(సైన్స్) దాగి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని మాక్స్ ముల్లర్ వంటి పాశ్చాత్య పరిశోధకులు సైతం నిరూపించారని గుర్తుచేశారు. యాదగిరిగుట్టలో జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేద విద్వాన్ మహాసభల్లో పాల్గొన్న గవర్నర్.. వేదాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ట్రస్ట్ తరఫున ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. ప్రతి విద్యార్థికి రూ.15వేల నగదు ప్రోత్సాహక చెక్కును పంపిణీ చేశారు. తెలంగాణ గడ్డపై వేద విద్యను ప్రోత్సహించడం శుభపరిణామమని, వేద విజ్ఞానంతోనే మన ప్రాచీన సంస్కృతి, సనాతన సంప్రదాయాలు పరిరక్షించవచ్చని తెలిపారు. యాదగిరిగుట్ట వేద అధ్యయనం, ఆధ్యాత్మిక సాధన, సాంస్కృతిక చైతన్యానికి ప్రముఖ కేంద్రంగా ఎదిగేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతకుముందు నారసింహుడి ఆలయానికి సతీసమేతంగా విచ్చేసిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆలయ ఈవో భవానీ శంకర్ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు.
నీటిని పొదుపుగా వాడాలి
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వర్షపాతం తగ్గి వాతావరణం ప్రతికూలంగా మారుతున్నందున.. ప్రజలంతా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. జల సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల వల్ల మాత్రమే సాధ్యం కాదని, ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రతిఒక్కరూ బాధ్యతగా ఆదా చేసినప్పుడే భావితరాలకు మేలు చేకూరుతుందని హితవు పలికారు. నీటి పొదుపుపై అవగాహన కల్పించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, ధార్మిక సలహాదారు గోవింద్ హరి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, దేవస్థానం ఈవో భవానీ శంకర్ పాల్గొన్నారు.