ప్రభాత ఉదయం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.20 వేల జరిమానా విధిస్తామని సర్పంచ్ ఆరె రమేష్ హెచ్చరించారు. సోమవారం ఆయన అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యానికి బానిసై కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, గ్రామంలో మద్యం విక్రయాలు పెరిగాయని మహిళలు, యువకులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.